పెళ్లి సంబంధాల పేరుతో వల.. ఘరానా మోసగాడి అరెస్టు
పెళ్లి సంబంధాల పేరుతో వల.. ఘరానా మోసగాడి అరెస్టు

పెళ్లి సంబంధాల పేరుతో వల.. ఘరానా మోసగాడి అరెస్టు
బంజారాహిల్స్: మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం.. పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించి వారి వద్దనుంచి ఎమర్జెన్సీ అంటూ డబ్బులు తీసుకోవడం..
తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకుని పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ చెరుకూరి (33) అనే యువకుడు షాది డాట్ కామ్ ఆన్ లైన్ లో వివిధ రకాలైన బోగస్ పేర్లతో రిజిస్టర్ చేసుకుని, ఆకర్షణీయమైన యువకుల ఫోటోలు పెడుతుంటాడు.
దీంతో పాటు ఇన్‌స్టా గ్రామ్, ఫేస్ బుక్ ,ట్విట్టర్ లలో ప్రొఫైల్స్ తయారు చేసి యువతులకు వల వేస్తుంటాడు. వారితో పరిచయం చేసుకుని, పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చి మరింత దగ్గర అవుతాడు.
వారితో కొన్నాళ్ళ పరిచయం తర్వాత ఎమర్జెన్సీ ఉందని తమ సంస్థ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని, ఐటి తనిఖీల వల్ల డబ్బులు అందుబాటులో లేవు అంటూ రకరకాల కారణాలు చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకుంటాడు.
తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం.. మరిన్ని డబ్బులు గుంజి బెట్టింగ్, జల్సాలకు వాడుతుంటాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లో నివాసం ఉంటున్న ఓ వైద్యురాలిని షాదీ డాట్ కామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
తన పేరు హర్ష చెరుకూరి అని, తాను బిజినెస్ చేస్తున్నానని, తన తల్లి డా. లక్ష్మి హరిత చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుందని నమ్మించాడు.
తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని, ఇటీవల ఐటీ శాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని చెప్పాడు. త్వరలోనే తల్లి ఇండియాకు వచ్చి పెండ్లి గురించి ఫైనల్ చేస్తుందని నమ్మించాడు.
నెల రోజుల క్రితం యువతికి ఫోన్ చేసిన హర్ష తనకు అర్జెంట్ గా కొంత డబ్బు కావాలని, తమ అకౌంట్స్ సీజ్ కావడంతో పాటు పాన్ కార్డును ఐటీ అధికారులు తీసుకువెళ్లారని నమ్మించాడు.
దీంతో అతడు సూచించిన నంబర్లకు పలు దఫా లుగా రూ.10.94 లక్షలను యువతి పంపించింది. ఫిబ్రవరి 21న తల్లి అమెరికా నుంచి వచ్చాక నిశ్చితార్థం ఉంటుందని చెప్పిన హర్ష ముఖం చాటేయడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించాడు.
దీంతో బాధితురాలు గత నెల 25న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష చెరుకూరిపై బీఎన్ఎస్ 79, 351(2), 319(2), 318(4)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
అతడి పేరు జోగాడ వంశీకృష్ణ అని తేలింది. ఏపీ, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే విధంగా పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది. 2016 నుంచి వంశీకృష్ణ మీద 21 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
రాచకొండ, సైబరాబాద్, సైబర్ క్రైమ్ స్టేషన్లలో పలు అరెస్టు వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని తేలింది.
గతంలో కొన్ని కేసుల్లో అరెస్టు అయిన వంశీ కృష్ణ బెయిల్ మీద బయటకు వచ్చి తన మోసాలు కొనసాగించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.
