నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపు

నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపు

నకిలీ డాక్టర్ల సెంటర్లకు అక్రమంగా అనుమతి

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల హల్చల్ కొనసాగుతోంది. పేద ప్రజల అవసరాలు, అమాయకత్వం, అవగాహన లోపం వాళ్లకి వరంగా మార్చుకొని వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు డాక్టర్ వి. నరేష్ కుమార్, డాక్టర్ కడాలి విష్ణు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎన్ఎంసీ చట్ట విరుద్ధంగా ఎంబీబీఎస్ విద్యార్హత లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్యుల సెంటర్లపై తనిఖీలు నిర్వహించింది.

తుర్కయంజాల్ కమ్మగూడలోని రాజర్శి ఇన్ఫర్మిటీ నిర్వాహకులు చంద్రశేఖర్ ఎంబీఏలో హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివి డాక్టర్ అవతారం ఎత్తాడు. తన సెంటర్కు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో 2023లో డాక్టర్ కాత్యాయని, ఈఎన్టీ సర్జన్ పేరు మీద ఒక బ్రోకర్ ద్వారా అనుమతి తీసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరూ లేకుండా తన వద్దకు వచ్చే పేషంట్లకు తానే డాక్టర్ అని నమ్మించి ఇష్టానుసారంగా యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, సెలైన్లు ఇవ్వడంతో పాటు ప్రిస్కిప్షన్ రాస్తున్నట్టు తనిఖీ అధికారులు గుర్తించారు. రాజర్శి ఇన్ఫర్మిటీ అనుమతికి సర్టిఫికెట్స్ ఇచ్చిన డాక్టర్ కాత్యాయని.. వారానికి ఒకసారి వచ్చి వెళ్తారని చెప్పిన నిర్వాహకుడు చంద్ర శేఖర్ను డాక్టర్ ఫోన్ నెంబర్ అడగగా తన వద్ద లేదని, డాక్టర్ ఎవరో కూడా తెలియదని చెప్పి తనకు బ్రోకర్ సర్టిఫికెట్స్ ఇచ్చి డీఎంహెచ్వో ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. సదరు బ్రోకర్ పేరు కూడా గుర్తులేదని, నెంబర్ కూడా దొరకట్లేదని నీళ్లు నమిలడం విశేషం. కాగా, తమ వద్ద కౌన్సిల్ రిజిస్టర్లో ఉన్న నెంబర్ ఆధారంగా డాక్టర్ కాత్యాయనిని ఫోన్లో సంప్రదించిన తనిఖీ అధికారులకు.. సదరు సెంటర్ నిర్వాహకుడు ఎవరో తెలియదని డాక్టర్ చెప్పడం గమనార్హం. అదే ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్గా చదివి ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన్ష్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్న పి. మహేష్, ఏఎన్ఎం చదివి కమ్మగూడ ప్రాంతంలో స్మార్ట్ క్యూర్ క్లినిక్ నిర్వహిస్తున్న చంద్రమ్మ అలియాస్ చంద్రకళ, బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డులో 10వ తరగతి మాత్రమే చదివి వాసు మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్లో అల్లోపతి వైద్యం చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్పై ఎన్ఎంసీ 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డా వి.నరేష్ కుమార్ తెలిపారు. రాజర్శి ఇన్ఫర్మిటీ హాస్పటల్ అనుమతిలో తన సర్టిఫికేట్ దుర్వినియోగం గురించి లఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని డాక్టర్ కాత్యా యనికి నోటీసు ఇవ్వనున్నట్టు టీజీఎంసీ సభ్యులు డాక్టర్ కడాలి విష్ణు తెలిపారు.

Ck News Tv

Ck News Tv

Next Story