ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండడంతో చదువుల ఒత్తిడికి లోనైన ఓ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి నెహ్రూ నగర్ లో నివాసం ఉండే ఉడుగుల రాజేశ్వరీ కుమారుడు దీక్షిత్ రాజ్ (17) మియాపూర్ లోని వశిష్ట కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలు ఉండడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ఉదయం రాజేశ్వరి పనికి వెళ్తున్న సమయంలో ఇంట్లోనే ఉన్న దీక్షిత్ రాజ్ సాయంత్రం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే ఆమె పని ముగించుకుని సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చింది.
ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గమనించి, తలుపు తోసుకుని ఇంటి పడకగదిలోకి వెళ్లింది. అక్కడ దీక్షిత్ రాజ్ చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో, శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి అతన్ని కిందకు తీసుకువచ్చారు. అప్పటికే దీక్షిత్ రాజ్ మృతి చెందాడు.
వారం రోజుల నుంచి తన కొడుకు చదువు విషయంలో ఒత్తిడికి లోనవుతున్నాడని, అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
