కార్పొరేషన్ లేదు.. ఎమ్మెల్సీ లేదు..!

కార్పొరేషన్ లేదు.. ఎమ్మెల్సీ లేదు..!
మాజీ ఎమ్మల్యే ప్రతాప్ రెడ్డికి మరోసారి ఝలక్
మాజీ ఎమ్మెల్యే ఆశలపై నీళ్లు చల్లుతున్న అధిష్టానం
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పార్టీలోకి..
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రతాప్ రెడ్డికి "రేవంత్" సూచన
స్థానిక ఎన్నికలపై ప్రతాప్ రెడ్డి మార్క్ ఎఫెక్ట్ ఉంటుందా..?
2023 శాసనసభ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజక వర్గ రాజకీయాల్లో కీలక భూమిక పోషించి ప్రత్యర్థులను కట్టడి చేసి.. వీర్లపల్లి శంకర్ ను మెజార్టీతో గెలిపించిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే "చౌలపల్లి ప్రతాప్ రెడ్డి" ఆశలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీళ్లు చల్లుతూ వస్తుంది. రాజకీయాల్లో అపార అనుభవం కలిగి, సౌమ్యుడిగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ రెడ్డికి
కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన అవకాశం లభించలేదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోటాలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత 2023 శాసనసభ ఎన్నికల్లో తనదైన పొలిటికల్ మార్క్ వేసి వీర్లపల్లి శంకర్ వెంట రథసారధిగా మారారు. గత ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్, ప్రతాప్ రెడ్డిల జోడి చూసి రాజకీయ కృష్ణార్జునలు అంటూ అందరూ సంబోధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్భలంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రతాప్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అందరు ఆశించారు.
గత ఎన్నికల సందర్భంగా శంషాబాద్ లోని ప్రతాప్ రెడ్డి స్వగృహానికి స్వయంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలబడతానని ప్రభుత్వం వస్తే మంచి అవకాశం కూడా ఇస్తానని చెప్పినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అనుచరుడు తాండ్ర కాశీనాథ్ రెడ్డి సమన్వయంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది.
ఆ తర్వాత ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చకచక కార్పొరేషన్ పదవులను రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి నమ్మిన బంటుగా పనిచేసిన వారికి పదవులు భర్తీ చేస్తూ వచ్చారు. ముఖ్యమైన కార్పొరేషన్ పదవుల్లో దాదాపు చాలామందిని చైర్మన్లుగా నియమించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి కార్పొరేషన్ పదవి వరిస్తుందని అందరు ఆశించారు.
కార్పొరేషన్ పదవిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సైతం ఆశలు పెంచుకున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పెద్దలతో తరచూ కలుస్తూ తన రాజకీయ అభివృద్ధికి సహకరించాలని పలు సందర్భాలు చాలామందిని కలిసి చర్చించారు.
తప్పకుండా పదవి వస్తుందని ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం కృషి చేశారు. కార్పొరేషన్ పదవులు రెండు దఫాలుగా పలువురికి కేటాయించగా వారిలో ప్రతాప్ రెడ్డి పేరు లేకపోవడంతో
తీవ్ర నిరాశకు గురయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ ను గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రతాప్ రెడ్డి తదితరులపై బాధ్యతను మోపారు. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాజకీయరంగంలో పావులు కదుపుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బోల్తా కొట్టించే వ్యూహాల్లో ప్రణాళికలు రచించి సఫలీకృతులు అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఓటమికి సదరు ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించిన వారిలో ప్రతాప్ రెడ్డి కీలకంగా వ్యవహరించడం గమనార్హం. ఇటీవల మొగలిగిద్ద పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో స్థానిక సంస్థల ఎన్నికలలొ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకురావాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలకు బహిరంగంగానే సూచించారు.
అయితే నేటి వరకు ప్రతాప్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో స్థానిక ఎన్నికలపై ఆ ఎఫెక్ట్ ఉంటుందా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
*ఎమ్మెల్సీ ఆశలపై నీళ్లు..*
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రముఖ నటి విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ లకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ప్రకటించారు. కార్పొరేషన్ పదవుల్లో అన్యాయం జరిగిన ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తుందంటూ ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు
దీనికి అనుగుణంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్సీగా ఏదైనా అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టారు. అయితే నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ప్రతాప్ రెడ్డి పేరు లేకపోవడం కొందరి అభ్యర్థిత్వం అనూహ్యంగా తెరపైకి రావడంతో ప్రతాప్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
వీరందరి పేర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినవే.
*అంతా భ్రాంతియేనా..?*
2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు కొనసాగిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కెరీర్ ఒడిదుడుకులతో కొనసాగుతోంది. ఆయన ఎమ్మెల్యే పదవి పోయాక నేటి వరకు తటస్థంగానే ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత అంజయ్య ఆయనపై గెలుపొందాక ప్రతాపరెడ్డి అనూహ్యంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి రాజకీయాల్లో ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అనాధగా మిగిలిపోయింది. బీఎస్పీ పార్టీ నుండి వీర్లపల్లి శంకర్ మల్లి కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు.
ఆ తర్వాత అనుయంగా వీర్లపల్లి శంకర్ కష్టపడి ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకొని 2023 శాసనసభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014 నుండి నేటి వరకు ఎలాంటి పదవులు ప్రతాప్ రెడ్డి అధిష్టించలేదు. బీఆర్ఎస్ పార్టీలో
సరైన సముచిత స్థానం లభించలేదు. పైగా ఆ పార్టీలో ప్రతాప్ రెడ్డి చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆత్మగౌరవం కోసం మళ్లీ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వచ్చిన ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఈ ఏడాదిన్నర కాలంలో ఆయనకు అచ్చిరాలేదనే చెప్పాలి. అటు కార్పొరేషన్ పదవులు లేక ఇటు ఎమ్మెల్సీ పదవులు రాక ప్రతాప్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమైంది..!
