విద్యార్థి మృతి స్కూల్ సీజ్ చేసిన MEO

*విద్యార్థి మృతి స్కూల్ సీజ్ చేసిన MEO*
సాగర్ గ్రామర్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కూలు వద్ద ఆందోళన కొనసాగుతుంది. మృతుని తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి సంఘాలు, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
తల్లిదండ్రులు లేకుండానే తమ బాబు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజ్గిరి డివిజన్ ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్, నాచారం పీఎస్ ల సీఐలు, డీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బందితో భారీగా బలగాలను మోహరించారు.
సరైన పర్యవేక్షణ లేకనే ఘటన జరిగిందా
టీచర్లు మందలించడంతో విద్యార్థి సంగారెడ్డి నాలుగో అంతస్తు టెర్రస్ పైకి వెళ్లి దూకేయడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో స్కూలు యాజమాన్యం దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్ ధృవీకరించడంతో హడావుడిగా గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు.
అయితే టీచర్లు మందలించిన కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు సదరు విద్యార్థి పైకి వెళ్లాడని, ఆ దారిని మూయకుండా స్కూలు సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని, పైగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ విషయాన్ని గమనించలేకపోయారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
స్కూల్‌ను సీజ్ చేసిన ఎంఈఓ
ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలా జరిగిందని ఆరా తీశారు. జిల్లా విద్యాధికారి ఆదేశం మేరకు సాగర్ గ్రామర్ స్కూల్ ని ఉప్పల్ ఎంఈఓ రామారావు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రామారావు మాట్లాడుతూ ప్రాథమిక విచారణలో పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్ వేధింపుల వల్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుందన్నారు.
విద్యార్థి సంఘాల నిరసన
విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడని తెలిసిన వెంటనే సాగర్ గ్రామర్ స్కూల్ దగ్గర మృతుని తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్వి నిరసన తెలిపింది. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ మరణించిన సంగారెడ్డి అనే విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ కరస్పాండెంట్, పీఈటీ, క్లాస్ టీచర్ ను వెంటనే అరెస్టు చేసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
