బంజారాలకు మంత్రి పదవి కల్పించాలని గిరిజన సంఘాల డిమాండ్
బంజారాలకు మంత్రి పదవి కల్పించాలని గిరిజన సంఘాల డిమాండ్

బంజారాలకు మంత్రి పదవి కల్పించాలని గిరిజన సంఘాల డిమాండ్
హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్: గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ మరియు గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో గిరిజన శక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంలో 30 లక్షల బంజారా జనాభా ఎంతో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ముగించి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బంజారా సామాజిక వర్గం వెన్నుతట్టిందని, అందువల్ల బంజారాలకు మంత్రి పదవి కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశోక్ రాథోడ్, గిరిజన జేఏసీ ఛైర్మన్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వినతిపత్రాలు మాత్రమే అందజేశామని, ఇకపై నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. జిల్లాల వారీగా గిరిజన సంఘాలు రాష్ట్ర మంత్రులకు, డీసీసీ అధ్యక్షులకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌తో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు.
అంతేగాక, ప్రతిజిల్లాలో మీడియా సమావేశాలు, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు నిర్వహించి, బంజారా సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగి ఆత్మగౌరవానికి ప్రతీకగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం సాధించాలని కోరారు.
ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ అధ్యక్షులు సురేష్ నాయక్ మాట్లాడుతూ, బంజారా జాతికి మంత్రి పదవి కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గెలిచిన నలుగురు బంజారా ఎమ్మెల్యేల్లో పార్టీకి విధేయతగల, సీనియారిటీ ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చితే ఈ సామాజిక వర్గం కాంగ్రెస్‌తో మమేకమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్పతి నాయక్, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్, ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఐతరాజు అంబెందర్, మాదిగ యూత్ ఫోర్స్ అధ్యక్షులు కొండ్రపల్లి రమేష్, రాజు నాయక్, లచ్చు సాదు, నరేష్, శివ చౌహన్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
