పోలీసు శాఖలో ఇంకా కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థ!

హోంగార్డులతో ఊడిగం..
పోలీసు శాఖలో ఇంకా కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థ!
వారంతా రిజర్వ్ హోంగార్డులు.. బందోబస్తు కోసం తరచుగా వీరి సేవలు ఉపయోగిస్తారు. మిగతా సమయంలో వారేం చేస్తారంటే ఆఫీసంతా ఊడ్చాలి.. ఇతర ఆఫీసర్ల ఇళ్లలో పని చేయాలి.. అంతేనా.. ఇంకే పని చెప్పినా మారుమాట్లాడకుండా చెప్పినట్లు చేయాలి.
ఇంతకూ వీరంతా మహిళలే. తమ పరిస్థితేంటో అర్థం కాక, ఎవరికి చెప్పాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు.
గోషామహల్‌లోని హోంగార్డు ఆఫీసులో కనిపించిన దృశ్యాలివి. ఆఫీసు ఆవరణంతా ఊడ్చేస్తున్న మహిళా హోంగార్డులు అక్కడ చెత్తను తగులబెడ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇంతకూ వీరి డ్యూటేంటంటే రిజర్వ్‌లో ఉంటూ పోలీస్‌శాఖకు సంబంధించి ఎక్కడ అవసరమైతే అక్కడ బందోబస్త్ డ్యూటీకి వెళ్లడం. కానీ పేరుకే బందోబస్త్ కానీ.. వారి పట్ల ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనేది వాస్తవం. రిజర్వ్ హోంగార్డులు మొత్తం 40 మంది ఉన్నారు.
ప్రతీరోజు ఉదయం ఎనిమిదిన్నరకు రోల్‌కాల్ నుంచి మొదలయ్యే వీరి డ్యూటీ సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది. ఒక్కోరోజు అంతకంటే ఎక్కువ సమయం కూడా ఉండాల్సి వస్తుంది.
ఇక వీక్లీ హాఫ్ కూడా తమపై అధికారి ఇష్ట్రపకారమే తీసుకోవాలి. అస్వస్థతకు గురైనా ఆఫీసుకు రావలసిందే. రాకపోతే జీతం కట్ చేస్తారు.
తమ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే పనిష్‌మెంట్‌తో పాటు ఆఫీసులో తమను మనుషుల లాగా కాకుండా చాలా దారుణంగా చూస్తున్నారంటూ ఈ హోంగార్డులు వాపోతున్నారు.
తమ డ్యూటీలు వేసే హెడ్‌కానిస్టేబుల్ ఏం చెబితే అదే ఫైనలని, తాము ఎలాంటి తప్పు చేయకున్నా.. పనితోనే పనిష్మెంట్ బోనస్ అని వారు చర్చించుకుంటున్నారు.
సీపీ రిజర్వ్‌గా ఉన్న ఈ విభాగంలో పనిచేస్తున్న వీరంతా ఇతర ఆఫీసర్లలో ఇళ్లలో పనికి కూడా వెళ్లాలట. అంటే ఇంకా పోలీస్‌శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనే వీరి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.
ఈ వ్యవహారమంతా తమ ఆర్‌ఐ దాకా తెలియకుండా హెడ్‌కానిస్టేబుల్ మేనేజ్ చేస్తున్నదని, పై అధికారులు అడిగినప్పుడల్లా తమను పనుల కోసం పంపుతున్నదని హోంగార్డులు అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే తాము ఆఫీసుకు వస్తే చెట్ల కిందే ఉండాలట. తమకంటూ ఒక రూమ్ లేదని, కనీసం టాయిలెట్స్ కూడా లేవంటూ వారు బాధపడుతున్నారు.
