ఓట్లు వేశాం..బరాబర్ మంత్రి పదవీ అడుగుతాం
ఓట్లు వేశాం..బరాబర్ మంత్రి పదవీ అడుగుతాం

ఓట్లు వేశాం..బరాబర్ మంత్రి పదవీ అడుగుతాం
బంజారా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జాతులకు మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తోందని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 60 స్థానాల్లో 45 స్థానాలు గిరిజనుల ఓట్లే కారణమన్నారు. ఓట్లు వేశాం కాబట్టే మంత్రి పదవులు అడుగుతున్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా గిరిజనులను పట్టించుకోవడమే మానేశారన్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కి మంత్రి పదువులు ఇవ్వడానికి వెనుకాడుతున్నారన్నారు.
రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న గిరిజన జనాభాకు ఒక్క మంత్రి లేకపోవడం విచారకరమన్నారు. గిరిజన ప్రతినిధులు ముఖ్యమంత్రితో పాటు గత, ప్రస్తుత కాంగ్రెస్ ఇన్‌చార్జీలను కలిసినా ఫలితం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవీతో తమకు న్యాయం జరుగదన్నారు.
జనాభాలో 12 శాతం ఉన్న బంజారాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలను అణచివేయాలని చూస్తోందని, అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క గిరిజనుడు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయడన్నారు.
తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ రాజేశ్ నాయక్, గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షులు అశోక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
