అక్షర చిట్ ఫండ్ మోసం... ఏజెంట్ ఆత్మహత్య
అక్షర చిట్ ఫండ్ మోసం... ఏజెంట్ ఆత్మహత్య

అక్షర చిట్ ఫండ్ మోసం... ఏజెంట్ ఆత్మహత్య
కరీంనగర్ శివారులోని మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య అలియాస్ రాజు (49) అనే అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నా డు
బాధిత కుటుంబ సభ్యులు, చిట్‌ఫండ్స్ బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన చింతల రాజయ్య అలియాస్ రాజు(39) అక్షర చిట్‌ఫండ్స్‌లో కొన్నేళ్లుగా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
రాజయ్య స్వంతంగా చిట్ వేయటంతో పాటు బంధువులు, పరిచయస్థులతో చిట్స్ వేయించాడు. చిట్ డబ్బులు ఇవ్వకుండా తనకు రావాల్సిన 5 లక్షల రూపాయలకు ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికి చిట్ సంస్థ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంది.
గడువు ముగిసినా డబ్బులు అందకపోవడంతో రాజయ్య ఆర్థికంగా నష్టపోయాడు. 5 లక్షల కోసం అక్షర చిట్‌ఫండ్స్ చుట్టూ రెండేళ్లుగా తిరిగాడు. మరో వైపు రాజయ్య ద్వారా చిట్ వేసినవారికి కూడా ఆ సంస్థ డబ్బులు చెల్లించకుండా మోసం చేసింది.
ఈ విషయాన్ని తన భార్యకు తరచుగా చెబుతూ బాధపడేవాడు. ఇదే విషయాన్ని తలుచుకుంటూ మనోవేదనతో శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి భార్య వేకువజామున భర్త కోసం వెతకగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు.
అక్షర చిట్‌ఫండ్స్ డబ్బులు చెల్లించక పోవటంతో ఆర్థికంగా నష్టపోయిన తన భర్త కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజయ్య ఆత్మహత్యవిషయం తెలుసుకున్న అక్షర చిట్‌ఫండ్స్ బాధితులు పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్షర చిట్‌ఫండ్స్ సంస్థపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా అక్షరచిట్‌ఫండ్స్ బాధితులు గంప జగన్, గెల్లు ఐలయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ అక్షర చిట్‌ఫండ్స్ సంస్థ చిట్ గడువు ముగిసినప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు చెల్లించకుండా ఒత్తిడి తెచ్చిన వారికి ఖాళీ చెక్కులు ఇచ్చి రెండేళ్లయినా చెల్లకుండా పోయాయన్నారు.
ఈ క్రమంలోనే ఏజెంట్ చింతల రాజయ్య తన 5 లక్షల డిపాజిట్ డబ్బులు, చిట్ డబ్బుల కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు.
ప్రజల సొమ్ముతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం
అవసరాలకు ఉపయోగపడుతాయని ప్రతి నెలా పొదుపు చేస్తూ అక్షర చిట్స్ సంస్థలో రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు, వితంతువులు, చిరువ్యాపారులు చిట్ వేసి బాధితులుగా మిగిలారు.
మొదట చిట్ వేయించుకున్న అనంతరం వారికి డబ్బులు చెల్లించకుండా అధిక వడ్డీతో నమ్మబలికి అక్షర టౌన్‌షిప్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుని గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారు.
కాళ్లు అరిగేలా తిరిగినవారికి అక్షర టౌన్‌షిప్ పేరిట చెక్‌లు ఇవ్వగా అవికూడా చెల్లకుండా పోయాయి. చివరకు కొందరికి అక్షర టౌన్‌షిప్‌లో స్థలాలను 4 రెట్లకు లెక్కచేసి అంటగట్టారు.
అక్షర చిట్‌ఫండ్స్ సంస్థకు తెలంగాణ వ్యాప్తంగా 65 బ్రాంచిలు ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో 50 నుంచి 60 కోట్ల వరకు చిట్ సభ్యులకు బాకీ ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.
కరీంనగర్ పోలీస్‌కమిషనర్ ఆదేశాలతో కరీంనగర్ జిల్లాలోని రెండు చోట్ల 14 కోట్ల రూపాయల ఆస్తులను ఇటీవల ప్రభుత్వం అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
వరంగల్, ఖమ్మం ఇతర చోట్ల ఉన్న ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
