గిట్టుబాటు ధర కోసం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి
![మిర్చి ధరలు పెంచాల్సిందే మిర్చి ధరలు పెంచాల్సిందే](https://cknewstv.in/h-upload/2025/02/11/1974891-img-20250211-wa0045.webp)
మిర్చి ధరలు పెంచాల్సిందే..
మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలి..
గిట్టుబాటు ధర కోసం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి
క్వింటాకు రూ.25వేల పైన చెల్లించాలని డిమాండ్
లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
17న తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
` సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఫిబ్రవరి 11, 2025 (మంగళవారం):` మిర్చి ధరల క్షీణతపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. తెగుళ్ల తీవ్రత, గణనీయంగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో క్వింటాకు కనీసం రూ.25వేలు చెల్లిస్తేనే రైతులకు కొంతమేరకైనా గిట్టుబాటు అవుతుందన్నారు.
గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ రూ.23వేలు ధర ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చొరవ చూపి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలనిడిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి నున్నా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌కు సోమవారం ఒక్కరోజే లక్ష బస్తాలకు పైగా మిర్చి అమ్మకానికి వచ్చిందన్నారు. జెండా పాట రూ.14వేలకు పైగా పలికినా అధిక భాగం మిర్చిని క్వింటాల్ రూ.13వేలలోపు ధరకే కొనుగోలు చేశారని తెలిపారు. పంట తెగుళ్ల బారిన పడటంతో నాణ్యత లేదనే పేరుతో క్వింటా రూ.6-8వేలకే కొనుగోలు చేస్తున్నారని వివరించారు. పెట్టుబడులు కూడా పూడే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్నారని, జిల్లాలో ఇటీవల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన బాణోత్ ధర్మా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. దానిని ఖమ్మం మార్కెట్‌లో రూ.11వేలకు విక్రయించాడని, ధర బాగా తగ్గిందనే మనోవ్యథతో చేను దగ్గరకు వెళ్లి గుండెపోటుతో మరణించాడని వివరించారు.
అంతకుముందు కూసుమంచిలో ఓ రైతు, రఘునాథపాలెం మండలం రేగులచలకకు చెందిన మాధవరావు, కోటపాడు రైతు భూపతిరావు ఇలా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సీపీఐ(ఎం) బృందం మార్కెట్‌ను సందర్శించినప్పుడు రోజుండే ధర కన్నా రూ.వెయ్యి అదనంగా పెంచుతున్నారని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ యథాస్థితేనని చెప్పారు.
దీనిపై జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు నష్టపోకుండా చూడాలని, మద్దతు ధర చెల్లించాలని ఆదేశాలిచ్చినా ఉపయోగం లేదన్నారు.
మిర్చి బోర్డు ఏర్పాటుకు డిమాండ్..
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకొచ్చి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేస్తే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ప్రయివేటు వ్యాపారులు సైతం మంచి రేటు పెడతారని చెప్పారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో రైతులు ఆందోళనలతో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు జరిపిన సందర్భాలు ఉన్నాయన్నారు. సుగంధ ద్రవ్యాల జాబితాలో ఉన్న మిర్చి బోర్డు ప్రస్తుతం కేరళలో ఉందని, మద్దతు ధర కోసం దానిని ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం నుంచి మిర్చి రైతులతో సమావేశాలు నిర్వహించి ఆందోళనలకు సమాయత్తం చేస్తామన్నారు. మిర్చి ధరలపై తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ఈనెల 17న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇప్పటికే వరికి అది కూడా సన్నాలకు మాత్రమే ఇస్తున్న బోనస్‌ను కూడా సకాలంలో చెల్లించాలని కోరారు.
వరితో పాటు మిగిలిన ఆహార పంటలన్నింటికీ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)