రాత్రికి రాత్రే పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్..?
రాత్రికి రాత్రే పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్..?

రాత్రికి రాత్రే పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్..?
◆ పాస్ బుక్ ఉంది ఆపై కోర్టు ఆర్డర్ ఉంది అయినా అధికారులు అడ్డదారిలో రిజిస్ట్రేషన్..?
◆ అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా ఖమ్మం రూరల్ తహసిల్దార్ కార్యాలయం
◆ విలేకరుల సమావేశంలో గోడు వెళ్లబోసుకున్న బాధితులు
ఖమ్మం, ఫిబ్రవరి 23 : తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి బంధువులకు కౌలుకి ఇస్తే అడ్డదారిలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఖమ్మం రూరల్ తహసిల్దార్ కార్యాలయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించారని ఖమ్మం రూరల్ మండలం ఆర్ఎంపిల గ్రామానికి చెందిన పావురాల కృష్ణ, భార్య శ్రీదేవి ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఆరెంపల గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 169/ఇ/5 లో గల 1:26 ఎకరాల భూమిని తండ్రి వారసత్వంగా పొందానని తెలిపాడు.
అట్టి భూమిని బంధువులైన బొడ్డు వెంకమ్మ ఆమె కొడుకు నాగేశ్వరావులకు కౌలుకి ఇచ్చామన్నారు. మేము జీవనోపాధికై వెళ్లి పాల్వంచలో ఉంటున్నామన్నారు. అదే అదునుగా చూసి 18 కుంటల భూమిని బొడ్డు వెంకమ్మ అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగతా 1:08 కుంటల భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి జాడా దుర్గాప్రసాద్ కు ఖమ్మం రూరల్ తహసీల్దార్, ఆర్ఐ ఫిబ్రవరి 6, 2025న రాత్రికి రాత్రే ఉన్న సర్వే నెంబర్ కు బై నెంబర్ తో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.
ఈ వ్యవహారం ముందే తెలిసి కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్స్ ను తీసుకువచ్చి తహశీల్దార్, ఆర్ఐ లకు వాట్సాప్ ద్వారా, స్వయంగా ఇచ్చినా రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన తీరును తహసీల్దార్ ను అడిగిన సందర్భంలో పరుష పదజాలంతో దూషించాడని ఆరోపించారు. ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసి కోర్టు ఆదేశాలను పాటించని ఖమ్మం రూరల్ తహసిల్దార్ పై చర్యలు తీసుకొని మా భూమిని మాకు అప్పగించాలని వేడుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో పావురాల శ్రీనివాస్, పావురాల నాగమణి, పావురాల రమేష్ పాల్గొన్నారు.
