కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు.. ఖమ్మం జైలు వద్ద ఎమ్మెల్సీ కవిత

అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్‌ను ఖమ్మం జైలులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ కేసీఆర్‌ని, ఆయన సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని వెల్లడించారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని తెలిపారు.

14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసి పోయిందన్నారు. ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారని ఆరోపించారు.

ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పి పెట్టుకుంటామంటే కుదరదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు.

Ck News Tv

Ck News Tv

Next Story