తెలంగాణలో డ్రగ్స్, గంజాయి ఉనికి ఉండొద్దు..
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి ఉనికి ఉండొద్దు..అసలా ఆ మాటలు కూడా వినపడొద్దన్న సర్కార్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ..
పోలీసులు అలెర్టయ్యారు. నిఘా ముమ్మరం చేసి ఎక్కడికక్కడ గంజాయి ముఠాల బెండు తీస్తున్నారు.
బస్తాల కొద్దీ గంజాయిని సీజ్ చేశారు. పట్టుకున్నది పట్టుకున్నట్టుగా గంజాయి సరుకును దగ్ధం చేస్తున్నారు. అంత చేస్తున్నా..ఎంతగా చర్యలు చేపట్టిన సరే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి గుప్పుమంటూనే ఉంది.
వైరా ..సత్తుపల్లి సైడ్ ఏపీ గంజాయి మత్తుకెక్కిస్తుంటే..అటు భద్రాచలం అడ్డాగా ఒడిశా, చత్తీసగఢ్ సరకు గంజాయిగాళ్లకు కిక్కెక్కిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కథ మాములుగా లేదు.
యువతను టార్గెట్ చేసిన గంజాయి మాఫియా, ఏకంగా కాలేజీలు, స్కూళ్లకు దగ్గర్లో అడ్డాలను ఏర్పాటు చేస్తున్నారు పెడ్లర్లు. అలాంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన టాస్క్ ఫోర్స్ టీమ్స్.. మత్తుగాళ్లను మడతేశారు. భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నారు
తాజాగా పాల్వంచ పట్టణంలోని నవభారత్ వద్ద బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కాస్త వింత ప్రవర్తనతో కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా… ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. పట్టుబడిన గంజాయి విలువ 2 లక్షలు ఉంటుందని సీఐ రమేశ్ తెలిపారు.
ఎక్సైజ్, పోలీసులు మరింత నిఘా పెంచాలనేది పబ్లిక్ డిమాండ్. ఉక్కుపాదం మోపుతున్నామంటున్నారు అబ్కారీ అధికారులు పోలీసుల. ఇటీవల పట్టుబడిన సరుకు, పెట్టిన కేసులే అందుకు నిదర్శమంటున్నారు.
గంజాయి తరలిస్తున్నవాళ్లను..వాడుతున్న వాళ్లను పట్టుకుంటున్నారే కానీ , అసలు సూత్రధారులను ఎందుకని టచ్ చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజాసంఘాల నేతలు. గంజాయి సాగు చేసినా..సరఫరా చేసినా ..వాడినా..కొన్నా.. సహకరించినా చట్టరీత్యా నేరం. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరం.
