భార్య పిల్లల కోసం వెళ్తే పెట్రోల్ పోసి నిప్పంటించారు
భార్య పిల్లల కోసం వెళ్తే పెట్రోల్ పోసి నిప్పంటించారు

భార్య పిల్లల కోసం వెళ్తే పెట్రోల్ పోసి నిప్పంటించారు
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. భార్యా పిల్లలను చూసేందుకు వచ్చిన అల్లుడిపై అత్తామామ, బామ్మర్దులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.
టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ దంపతుల కుమార్తె కావ్య, పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్(24) మూడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రిషన్ పనిచేస్తూ సుజాతనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే ఐదు నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో అప్పటి నుంచి కావ్య తన తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది.
కాగా, ఈ నెల 2న రాత్రి భార్యా పిల్లలతో మాట్లాడటానికి అత్తగారి ఇంటికి వచ్చిన గౌతమ్‌ను అత్త మామ, బామ్మర్దులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మంటలకు తాళలేక అక్కడే ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గౌతమ్ మృతి చెందారు. మృతుడి తండ్రి బల్లెం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
