మహిళా జడ్జిపై ఖైదీ దాడి

మహిళా జడ్జిపై ఖైదీ దాడి.. రంగారెడ్డి జిల్లా కోర్టులో దుశ్చర్య
కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విసిరిన నిందితుడు
కోర్టు నుంచి ఖైదీని తరలిస్తుండగా ఆగ్రహంతో చుట్టుముట్టిన న్యాయవాదులు
రంగారెడ్డి జిల్లా కోర్టులు, హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్‌లో గురువారం మహిళా జడ్జిపై ఓ ఖైదీ దాడి చేశాడు.
హత్య కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విసిరాడు. ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన న్యాయవాదులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అత్తాపూర్ సిఖ్ విలేజ్‌కు చెందిన కరణ్‌సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి(22) నార్సింగి ఠాణా పరిధిలో ఓఆర్‌ఆర్ సమీపంలో 2023 జనవరి 5న అర్ధరాత్రి దారిదోపిడీ చేస్తూ... కత్తితో పొడిచి ఒకరిని హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయి జగద్గిరిగుట్టలో తలదాచుకున్నాడు. మరుసటి రోజు అతడిని అరెస్టు చేసేందుకు ఎస్‌వోటీ పోలీసులు వెళ్లగా ఇద్దరిపై తల్వార్‌తో దాడి చేశాడు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదైంది. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పోలీసులపై హత్యాయత్నం కేసులో మహిళా జడ్జి బుధవారం(ఈ నెల 12న) కరణ్‌సింగ్‌కు జీవితఖైదు విధించారు. నార్సింగి హత్య కేసు విచారణ నిమిత్తం పోలీసులు గురువారం మళ్లీ కోర్టులో హాజరుపరిచారు. అయితే, జైలులో ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకొంటానని జడ్జిని అతడు అభ్యర్థించాడు. ఆమె అంగీకరించడంతో ఎస్కార్ట్ పోలీసులు ఖైదీని జడ్జి సమీపంలోకి తీసుకెళ్లారు. జీవితఖైదు శిక్షను మనసులో పెట్టుకుని... దగ్గరికి వస్తూనే తన చెప్పును తీసి జడ్జిపైకి విసిరాడు. తర్వాత జడ్జిని, ఆమె కుటుంబాన్ని అంతుచూస్తానని బెదిరించాడు. అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన జడ్జి తప్పించుకొని, అక్కడే నిల్చున్నారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని పక్క గదిలోకి తీసుకెళ్లారు. ఘటనతో ఆవేశానికి లోనైన న్యాయవాదులు కరణ్‌సింగ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఎల్బీనగర్ ఎస్‌హెచ్‌వో వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు కరణ్‌సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం విషయాన్ని మహిళా జడ్జి... జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డికి వివరించారు. ఘటనపై న్యాయస్థానం పరిపాలనాధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
భద్రతా వైఫల్యంపై న్యాయమూర్తుల సంఘం అసంతృప్తి
మహిళా జడ్జిపై ఖైదీ దాడి ఘటనను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఖండించింది. దీన్ని న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. జ్యుడిషియల్ అధికారుల భద్రతలో వైఫల్యం ఏమిటని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు, ఆదిలాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె.ప్రభాకర్‌రావు; సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జిల్లా అదనపు జడ్జి కె.మురళీమోహన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
