ప్రమాదాలు చోటుచేసుకున్నా పట్టించుకోని వైనం

ప్రాణాలు పోతున్న పట్టించుకోరా

పరిమితికిమించి ఇష్టారీతిన ఆటోల్లో ఎక్కుతూ మృత్యువును కొనితెచ్చుకుంటున్నారు. పోలీసు, రవాణాశాఖాధికారులు నిరంతరం పర్యవేక్షించి ప్రమాదకర ప్రయాణం వద్దని వారిస్తున్నా వినిపించుకోవడం లేదు. చివరికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినా వాటిలో ఎక్కడం లేదు. ప్రైవేటు వాహనాల వైపే మొగ్గు చూపుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.

మిరప కోతలకు వేలాది మంది గ్రామాల బాట

మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, బేస్తవారిపేట, త్రిపురాంతకం తదితర మండలాల్లో మిరప కోతల సీజన్‌లో వేలాది మంది పట్టణం నుంచి కూలీలు వెళ్తున్నారు. ఏటా నవంబరు మొదలుకొని మార్చి వరకు కూలీలు మిరప కాయలు కోసేం దుకు ఆటోల్లో గ్రామాలబాట పడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో పెద్ద ఆటోలో పరిమితికి మంచి 30 మంది వరకు వెళ్తున్నారు. వాస్తవానికి 8 మందికంటే ఎక్కువగా అందులో అనుమతించడానికి వీలులేదు. కానీ కొందరు కూలీలను తరలించే మేస్త్రీలు అత్యాశతో నిబంధనలను అతిక్రమంచి ఆటోల్లో కూలీలను తరలిస్తున్నారు. ఒకవైపు ప్రమాదకర ప్రయాణమని తెలిసినా పనిచేసే ప్రదేశం వరకు ఆటోలు వెళ్తుండడంతో కూలీలు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. మార్కాపురం పట్టణంలోని విజయాటాకీస్‌, శ్రీనివాస థియేటర్‌ ప్రాంతాలు, ఎస్టేట్‌, తూర్పువీధి, ఆర్టీసీ బస్టాండ్‌ వెనుకవైపు, పూలసుబ్బయ్య, భగత్‌సింగ్‌, బాపూజీ కాలనీల నుంచి నిత్యం వేలాదిమంది కూలీలు మిరప కోతలకు వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఉదయం 7.00 గంటలకల్లా ఆటోలు వెళ్లి 8.30 గంటలకల్లా పని ప్రదేశానికి తీసుకెళ్తాయి. సాయంత్రం మళ్లీ 6.00 గంటలకల్లా వారిని స్వస్థలాలకు తీసుకొస్తాయి.

ప్రమాదాలు చోటుచేసుకున్నా పట్టించుకోని వైనం

మార్కాపురం డివిజన్‌లో 2024-25 సీజన్‌లోనే ఇప్పటి వరకూ సుమారు 17 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ప్రమాదాలకు ఓవర్‌లోడే ప్రధాన కారణం. ఉదాహరణకు అప్పీ ఆటోలనే తీసుకుంటే డ్రైవర్‌ సీటుకు రెండు వైపులా నలుగురు కూర్చుంటున్నారు. దీంతో మలుపుల వద్ద ఆటోలు తిరగడం కష్టమవుతోంది. అంతేకాక డ్రైవర్‌ ఒత్తిడికి గురి కావడంతో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ పోలీసులు, రవాణాశాఖ అఽధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి కూలీలకు ఆటోల్లో ప్రయాణించవద్దని అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోకపోవడం లేదు. ఒకవైపు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పనులకు వెళ్లే కూలీలకు చీమకుట్టినట్లైనా ఉండటంలేదు. మార్కాపురం పోలీసులు ప్రయోగాత్మకంగా ఒక అడుగు ముందుకేశారు. కూలీలను ప్రమాదాల బారినుంచి తప్పించేందుకు ఆయా గ్రామాలలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయించారు. గత నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిత్యం 6 బస్సులు పంపుతున్నారు. తొలుత ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లినా మళ్లీ దొంగచాటుగా ఆటోల్లో కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామ సమీపంలో కూలీల ఆటో బోల్తాకొట్టి పట్టణానికి చెందిన ఇద్దరు కూలీలు మృతిచెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. ఇప్పటికైనా కూలీలు తమ ఆలోచన తీరును మార్చుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. అదేవిధంగా కూలీలను తరలించే ఆటోలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Ck News Tv

Ck News Tv

Next Story