గడ్డంగూడవాసులపై ఎఫ్‌ఆర్వో ఫైర్

*పురుగుల మందు తాగి చావండి..*
గడ్డంగూడవాసులపై ఎఫ్‌ఆర్వో ఫైర్
మందు గుళికలు మింగిన రైతు
జన్నారం రేంజ్ కార్యాలయానికి తరలించి ఆందోళన
ఆపై లక్షెట్టిపేట దవాఖానకు
అధికారుల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
అటవీ అధికారి అవమానించడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన రైతు మందు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్‌లోని గడ్డంగూడలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను రెండు రోజుల క్రితం అటవీ అధికారులు తొలగించారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం గడ్డంగూడకు సిబ్బందితో చేరుకున్న ఎఫ్‌ఆర్వో సుష్మారావు.. 'ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వెంటనే ఖాళీ చేయాలి. లేదంటే సామాన్లను రేంజ్ కార్యాలయానికి తరలిస్తాం' అని రైతులను హెచ్చరించారు.
3 రోజులు గడువు ఇవ్వాలని వారు కోరగా.. 'పురుగుల మందు తాగి చావండి.. డబ్బులు లేకుంటే నేనిస్తా' నంటూ పోలీసుల ముందే దూషించడంతో కాలనీకి చెందిన రైతు రాథోడ్ తుకారాం విషగుళికలు మింగాడు. అతడిని కుటుంబ సభ్యులు, గూడెం వాసులు జన్నారం రేంజ్ కార్యాలయానికి తరలించి ఆందోళన చేపట్టారు.
తుకారాం పరిస్థితి విషమించడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి లక్షెట్టిపేట దవాఖానకు తరలించారు. ఆందోళనలో బోడ శంకర్, వసంత్‌రావు, పంతుల్యా, రాజు, రాంచందర్, జైతురావ, రమేశ్, శివ, రాథోడ్ లక్ష్మీబాయి, మన్నీబాయి, జగదీశ్ పాల్గొన్నారు.
అధికారులు ఓవర్ యాక్షన్ ఆపండి: సీతక్క
అటవీశాఖ అధికారులు ఆంక్షల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓవర్ యాక్షన్ ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని పైడిపెల్లి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. టైగర్ జోన్ పేరుతో ఈ ప్రాంత ప్రజలను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలను నిలిపివేయడం వల్ల వాహనదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. పదేండ్లలో లేని ఆంక్షలు ఈ ఒక్క సంవత్సరంలో ఎలా వచ్చాయని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
