మెదక్‌లో ట్రాఫిక్‌ సిగ్నళ్లకు కరెంట్‌ కట్‌

మీరు ఫైన్ వేస్తే.. మేమ్ కట్ చేస్తాం..!

మెదక్‌లో ట్రాఫిక్‌ సిగ్నళ్లకు కరెంట్‌ కట్‌

చలాన్‌ వేశారని విద్యుత్‌ ఉద్యోగుల కన్నెర్ర

మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్‌ వేస్తారా?'అంటూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్‌ సిగ్నళ్లకు విద్యుత్‌ నిలిపివేసిన ఘటన మెదక్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిగ్నల్స్ ఎందుకు పనిచేయడం లేదని ఆరా తీస్తే మాకే ఫైన్ వేస్తే ఊరుకుంటామా అనే ధోరణిలో విద్యుత్ శాఖ అధికారుల సమాధానం విస్మయం కలిగించింది. మెదక్ పట్టణంలో ఈ నెల 14 న ముగ్గురు ట్రాన్స్ కో సిబ్బంది బైక్ పై వెళ్తుంటే ట్రాఫిక్ అధికారులు ఫోటో తీసి ఫైన్ వేశారు. ట్రాఫిక్ సిబ్బంది ఫైన్ వేయడం పై ట్రాన్స్ లో అధికారులకు కోపం వచ్చింది. మన కరెంట్ తో నడిచే సిగ్నల్స్ వద్ద మనకే జరిమానా వేస్తారనుకున్నారేమో వారికి ఉన్న అధికారంతో పట్టణంలోని రాందాస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కు కరెంట్ కట్ చేశారు. 18న, 19న కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో టెక్నికల్ సమస్యగా పోలీసులు భావించారు. బుధవారం సిగ్నల్ వద్ద పరిశీలించగా కరెంట్ సరఫరా లేదు. దీనితో ట్రాన్స్ కో ఏఈ సమాచారం ఇస్తే ఎమర్జెన్సీ పనులు చేస్తే మా సిబ్బందికి త్రిబుల్ రైడ్ ఫైన్ వేస్తే ఎలా అనే సమాధానం వచ్చినట్టు తెలిసింది.

బైక్ కు జరిమానా వేయడం వల్లనే సిగ్నల్స్ కు కరెంట్ నిలిపి వేసినట్టు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే బైక్ పై ముగ్గురు వెళితే ఫైన్ వేస్తే కరెంట్ కట్ చేయడం ఏమిటి అనే సందేహం వ్యక్తం అవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ట్రాన్స్ కోకు మారవని పోలీసులు చెబుతున్నారు. కానీ ట్రాన్స్ కో అధికారులు మాత్రం ఫైర్ ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు ఫైన్ చేశారని, అందువల్లే కరెంట్ కట్ చేసినట్టు చెబుతున్నారు. పోలీసులు ఫైన్ వేసింది 14 న, మెదక్ లో ఫైర్ ప్రమాదం జరిగింది 17 న కావడం గమనార్హం. ఫైన్ పేరుతో సిగ్నల్ కరెంట్ కట్ చేయడం పై విద్యుత్ శాఖ పై విమర్శలు వస్తున్నాయి. దీని పై ట్రాన్స్ కో ఏఈ నవీన్ ను వివరణ కోరగా విధి నిర్వహణలో వెళ్తున్న సిబ్బందికి జరిమానా వేధించడం సరికాదన్నారు. విద్యుత్ సిబ్బంది అని చెప్పిన వినకుండా జరిమానా విధించడంతో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన స్పందన లేదని, ఇందులో భాగంగానే నిబంధనలు విరుద్ధంగా మోటర్ లు లేకపోవడం మూలంగా కట్ చేసినట్టు చెప్పారు.

Ck News Tv

Ck News Tv

Next Story