అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.
ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా తొగర్ పల్లికి చెందిన గౌరెల్లి వినోద్ రెడ్డి (33) శుభకార్యాలకు వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 7న ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
ఈ క్రమంలో సోమవారం ఏడుపాయల రెండో వంతెన సమీపంలోని అటవీ ప్రాంతంలో బండరాయిపై తలకు బలమైన రక్త గాయంతో ఉన్న మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతి చెందింది వినోద్ రెడ్డిగా గుర్తించారు.
తలకు బలమైన గాయం ఉండడంతో అనుమానాస్పద మృతిగా మృతుడి అన్న విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు.
