పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా

వైద్యం వికటించి మహిళ మృతి.. పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా
వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది.
వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అయితే సదరు మహిళ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన మమతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. అయితే సోమవారం నాడు ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో మెహిదీపట్నంలోని ప్రీమియర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మమత మార్గమధ్యలోనే మృతిచెందింది. అయితే ఇంజెక్షన్ వికటించడంతోనే మమత మృతిచెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి ఎదుట మృతదేహం ఉంచి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
