శ్రీ చైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

పెండింగ్‌ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్‌ అందరి ముందు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్మకు యత్నించింది.చికిత్స పొందుతూ చనిపోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మేడ్చల్‌ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె అఖిల (16), కుమారుడు విక్రమ్‌ పదో తరగతి చదువుతున్నారు. వారిద్దరి ఫీజు రూ.90వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ. 10 వేలు చెల్లించారు. మిగితా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. విక్రమ్‌ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు వెచ్చించాల్సి రావడంతో ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్‌ రమాదేవి తోటి విద్యార్థుల ముందే టెన్త్‌ పరీక్షలు వచ్చాయని, ఫీజు చెల్లించాల్సిందేనని గట్టిగా మందలించారు.

దీంతో మనస్థాపానికి గురైన అఖిల స్కూల్‌ నుంచి ఇంటి వరకు ఏడుస్తూ వచ్చింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకుండా తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్‌ మేడం టార్చర్‌ చేస్తున్నారని చెప్పుకొని కన్నీరుపెట్టింది. తిరిగి పాఠశాలకు వెళ్తే అవమానం తప్పదని భావించిన అఖిల.. సోమవారం నుంచి పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. ఎంత సేపటికీ బయటికి రాకపోయే సరికి తల్లి కమల పక్కన ఉన్న కిటికీలో నుంచి చూడగా, అఖిల ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు గుర్తించింది. వెంటనే ఇరుపొరుగు సహాయంతో డోర్‌ ను బలవంతంగా తెరిచి, కిందికి దించారు. అప్పటికే అఖిల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రాథమికంగా చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో అదే రోజు సాయంత్రం యశోద ఆస్పత్రికి తరలించారు.

బుధవారం సాయంత్రం చికిత్స పొందుతూ అఖిల మృతి చెందింది. అంతకుముందు ఉదయం అఖిల తల్లి పాఠశాలకు వెళ్లి.. ప్రిన్సిపాల్‌తో పాటు యాజమాన్యాన్ని నిలదీశారు. తన కూతురు ఉరేసుకోవడానికి మీరే కారణమంటూ.. కన్నీరుపెట్టుకున్నారు. రెండేండ్ల నుంచి తన పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని, కొద్ది రోజుల కిందట కొడుకు విక్రమ్‌కు ఇంగ్లిషులో మార్కులు తక్కువగా వచ్చాయని, ఇబ్బంది పెట్టడంతో మానసికంగా దెబ్బతిన్నాడని ఆరోపించారు. పాఠశాలకు కూడా రావడం లేదన్నారు. అతడిని చూసుకునేందుకు తాను ఉద్యోగం మానేసినట్లు చెప్పారు. ఉద్యోగం మానేయడం, వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో సరైన సమయంలో ఫీజులు చెల్లించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించేందుకు రుణం తీసుకుంటున్నామని, రాగానే మొత్తం చెల్లిస్తామని కూడా ప్రిన్సిపాల్‌కు చెప్పామన్నారు.

ఆర్థ్ధిక పరిస్థితి బాగలేక ఒక విద్యార్థి ఫీజు చెల్లించకపోతే నష్టం వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ ఫీజు కోసం టార్చర్‌ పెడుతున్నారని, పేద తల్లిదండ్రులు ఇలాంటి పాఠశాలల్లో తమ పిల్లలను చదివించి, తమ బిడ్డలను చంపుకోవద్దని కోరారు. కాగా, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పాఠశాల ముందు బైఠాయించి..యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ.. తాము అఖిలను వేధించలేదన్నారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. అవమానకరంగా మాట్లాడలేదని చెప్పారు. గత ఏడాది ఫీజును ఈ నవంబర్‌లో పూర్తి చేశారని, ఈ ఏడాది ఫీజు ఇద్దరు పిల్లలకు కలిపి రూ. 10 వేలు మాత్రమే చెల్లించారని వివరించారు. మూడు రోజుల నుంచి స్కూల్‌ కు రాలేదని, తమకు విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మంగళవారం రాత్రి తెలిసిందన్నారు. యాజమాన్యానికి జరిగిన విషయాన్ని వివరించామని ప్రిన్సిపాల్‌ రమాదేవి, రీజినల్‌ ఇన్‌చార్జి చక్రి తెలిపారు.

Ck News Tv

Ck News Tv

Next Story