సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క


ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం లో బుధవారం రాత్రి సమ్మక్క- సారలమ్మ లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క దర్శించు కున్నారు.

ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

నాలుగు రోజులపాటు జరిగే జాతర పరిసరాల్లో నిరం తరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలు వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ, అని వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటు లో ఉంచుకోవాలని,

అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రంచేయించాలని తెలిపారు.భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు.

ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు.

జాతరను పురస్కరించు కొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ అత్రం సుగుణ , కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story