ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి...ఏం జరిగిందంటే....

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి...ఏం జరిగిందంటే....
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాల విద్యార్ది మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోయం వినీత్(14) పేరూరు అశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
మంగళవారం వినీత్‌కు జ్వరం రావడంతో అక్కడే ఉన్న హెల్త్ వర్కర్ జ్వరం టాబ్లెట్ ఇవ్వటంతో జ్వరం తగ్గింది.
అయితే రెండు రోజులు సెలవు రావడంతో విద్యార్ది వినీత్ ను ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత మళ్లీ జ్వరం రావడంతో విద్యార్ది మేనమామ శ్రీకాంత్ ధర్మవరం ఆర్ఎంపీ వైద్యుడి వద్ద వైద్యం చేయించారు.
అయినప్పటికీ తగ్గలేదు. వినీత్‌కు కడుపు నోప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
పాఠశాల ముందు ఆందోళన....
వార్డెన్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్ది వినీత్ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విద్యార్థి వినీత్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్య సేవలు సకాలంలో అందించి ఉంటే మృతి చెందే వాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా విద్యార్థి మృతికి నిరసనగా బంధువులు ఆశ్రమ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్ది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఆశ్రమ పాఠశాల విద్యార్ది వినీత్ 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా వార్డెన్, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం వహించారని, దాంతోనే మృతి చెందాడని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహ మూర్తి ఆరోపించారు.
పాఠశాల ముందు ఆందోళన చేసినా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
