రుణమాఫీ చేసే దాకా ఇక్కణ్నుంచి పోను.. గాంధీభవన్‌ మెట్లపై రైతు యాదగిరి నిరసన

రుణమాఫీ చేసే దాకా ఇక్కణ్నుంచి పోను.. గాంధీభవన్‌ మెట్లపై రైతు యాదగిరి నిరసన

కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని నమ్మి ఆ పార్టీకి ఓటేశానని, కానీ ఇప్పటి వరకు తనకు రుణమాఫీ కాలేదని ఓ రైతు శుక్రవారం గాంధీభవన్‌ మెట్ల మీద నిరసన తెలిపాడు.

తనను జైల్లో వేసినా సరే భయపడనని, అందుకు తాను సిద్ధమేనని, రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి పోనని భీష్మించుకొని కూర్చున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం అంబర్‌పేటకు చెందిన రైతు తోట యాదగిరిగికి అదే గ్రామం సర్వే నెంబర్‌ 444/46లో వ్యవసాయ భూమి ఉంది. దీనిపై ఆయన క్రాఫ్‌లోన్‌ తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రుణం రూ.2 లక్షల వరకు ఉంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌రెడ్డి రైతులు రుణాలు కట్టవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన తోట యాదగిరి కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆ పార్టీని గెలిపించారు. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తోట యాదగిరి మాత్రం రుణమాఫీ కాలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. మరోవైపు 14 నెలల కాలంలో అసలు, వడ్డీ కలిపి రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో ఆందోళన చెందిన ఆయన శుక్రవారం గాంధీభవన్‌ మెట్లపై బైఠాయించారు. రూ.2 లక్షల రుణమాఫీతో పాటు తాను విక్రయించిన వడ్లకు బోనస్‌ కూడా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రుణమాఫీ కాలే.. బోనస్‌ రాలే

రెండు లక్షల రూపాయల పంట రుణం మాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిండు. రుణమాఫీ చేస్తారనే ఆశతోనే రైతులందరం రేవంత్‌రెడ్డికి ఓట్లేసి గెలిపించనం. ఆయన అధికారంలోకి వచ్చిండు. కానీ, మా రుణం మాఫీ కాలేదు. రెండు లక్షలు మాఫీ చేస్తే మిగతా డబ్బులు మేం కట్టుకుంటాం. 55.85 క్వింటాల వడ్లు అమ్మిన. దానికి బోనస్‌ కూడా ఇంత వరకు రాలే. ఇటు రుణమాఫీ కాలే.. అటు బోనస్‌ రాలే. పింఛన్‌ కూడా రావట్లేదు. మా అబ్బాయికి కరోనా వస్తే రూ.25 లక్షలు ఖర్చు అయింది. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే లోన్‌ కట్టలేకపోయినం. ప్రభుత్వం తరఫున నాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు నేను కదలను. జైల్లో పోయేందుకు సిద్ధమే.

– తోట యాదగిరి, రైతు, తుంగతుర్తి

Ck News Tv

Ck News Tv

Next Story