
కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు!
మే 9 వరకు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు
కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మే 9 వరకు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
గత ప్రభుత్వం కల్పించిన ఆ రిజర్వేషన్లను అప్పటి వరకూ యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, ఉద్యోగావకాశాల్లో ఓబీసీలోని 2బి కేటగిరీ కింద ముస్లింలకు కేటాయించిన 4శాతం కోటా రద్దు చేస్తూ బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
వీటికి సమాధానమిచ్చేందుకు కర్ణాటక సర్కారు తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరారు. దీంతో జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మే 9 తేదీకి వాయిదా వేసింది.
ఆ మరుసటి రోజు(మే 10న) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండడం గమనార్హం. మంగళవారం నాటి ఈ కేసు విచారణను వాయిదా వేయాలని తుషార్ మెహతా కోరగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వ్యతిరేకించారు. ఇప్పటికే ఈ కేసు నాలుగు మార్లు వాయిదాపడిందని గుర్తు చేశారు.
అయితే, ఇప్పటికే జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులు పిటిషనర్లకు అనుకూలంగానే ఉన్నాయని మెహతా తెలిపారు. తదుపరి విచారణ తేదీ వరకు ముస్లిం కోటా అమలును కొనసాగిస్తామని, ఒక్కలిగలు, లింగాయత్‌లకు వాటిని వర్తింపజేయబోమన్న మెహతా హామీని నమోదు చేయాలని దుష్యంత్ దవే సూచించగా ధర్మాసనం అంగీకరించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా ఆదేశాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి బొమ్మై స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ముస్లిం కోటా రద్దు జోలికి వెళ్లబోమని తెలిపారు.