
కులాంతర వివాహాలకు రక్షణ ఏది?
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశం అనేక జాతుల, వర్గాల, కులాల సమ్మిశ్రిత సామాజిక రూపంలో ఉందని చెప్పారు. భారతీయులంతా సంకరులే అని తెలిపారు. అప్పుడు ఆ విషయం మీద సమాజానికి అంతగా అవగాహన లేదు. పెళ్లంటే కులం పెళ్లే అనుకున్నారు. ఇప్పుడు పెళ్లి కులాన్ని దాటిపోయింది. ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో గుణం, ప్రతిభ, రూపం, రక్షణ అన్ని చూసుకుంటున్నారు.
వధువు వరుణ్ణి ఎన్నుకుంటుంది. వరుడు వధువుని ఎన్నుకుంటున్నాడు. ఇది తల్లిదండ్రులకు నచ్చడం లేదు. తల్లిదండ్రులు ఇంకా కులం భావంలోనే ఉన్నారు. ఈ కుల నిర్మూలనను ప్రచారం చేయవలసిన బాధ్యత ఎక్కువగా ప్రభుత్వానిదే. ఒక సామాజిక మార్పు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన మార్పు. తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పని బాగా చేయగలుగుతున్నారు.
కులాంతర వివాహాలకు 10 లక్షలు ఇస్తున్నారు. ఇల్లు కట్టిచ్చి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. వధూవరులకు రక్షణ కల్పిస్తున్నారు. కులాంతర వివాహాల్ని ఒక ఉద్యమంగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రదేశంలో కులాంతర వివాహితులకు రక్షణ లేదు. వారికి లక్ష రూపాయలు ప్రకటించారు కానీ, అవి సరిగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం, కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం, వారికి ఇవ్వవలసిన రక్షణ, ఉద్యోగ భద్రత, నివాసయోగ్యత, ప్రోత్సాహక నిధి పెంచవలసిన అవసరం ఉంది.
రాబోయేది కుల నిర్మూలనా యుగం. ఇకపై కులంలో పెళ్లిళ్లు తగ్గిపోతాయి. దీనివల్ల మంచి పిల్లలు పుడుతారు. వరకట్నాలు ఉండవు. వధూవరులు ఇద్దరు పని చేసుకోగలుగుతారు. స్వీయ ప్రతిపత్తి ఏర్పడుతుంది. బాల్యవివాహాలు, మేనరికాలు, కుల వివాహాలు బాగా తగ్గుతాయి. మేనరికల వల్ల కూడా వికలాంగ సమాజం పెరుగుతుంది. కాబట్టి ముందు ఈ మేనరిక వివాహాల్ని, బాల్యవివాహాల్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతి సచివాలయానికి ఈ విషయాల పట్ల అవగాహన కలిగించి నిబంధనల్ని కఠిన తరం చేయాల్సి ఉంది. సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రేమ వివాహాలు కూడా 18 ఏళ్లు దాటిన తర్వాతే చేసుకోవాలనే అవగాహనను యువతీ యువకులలో ఏర్పరచాలి. అప్పుడే వారి చదువులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ అవగాహనతో యువతీ యువకుల్లో మార్పు రావాలి.