
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఘాతుకం.. ఐదుగురు జవాన్లు మృతి.. ఘటన స్థలానికి ఉన్నతాధికారులు..!!
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలపై పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు.
ఈ దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. వివరాలు.. ఇటీవల జమ్మూలోని భాటా ధురియన్‌లోని టోటా గలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు రాజౌరీ సెక్టార్‌లోని కాండి ఫారెస్ట్‌లో ఉన్నట్టుగా భద్రత బలగాలకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది.
దీంతో భద్రతా బలగాలు మే 3వ తేదీన సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఒక సెర్చ్ బృందం గుహలో ఉగ్రవాదుల ఉన్నట్టుగా గుర్తించడంతో.. ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఆ ప్రాంతం రాతి, నిటారుగా ఉన్న కొండలతో దట్టంగా వృక్షాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆర్మీ ఉన్నతాధికారి సహా నలుగురు గాయపడ్డారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోని అదనపు బృందాలను తరలిస్తున్నామని.. గాయపడిన సిబ్బందిని ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే గాయాల కారణంగా మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ పురోగతిలో ఉందని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉగ్రమూక చిక్కుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తతుం రాజౌరి ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాలు నిలిపివేయబడ్డాయి.
మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న రాజౌరిలోని కాండి ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ చేరుకున్నారు.