
రిటర్నులకు సిద్ధం అయ్యారా.?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అవుతాయి. యాజమాన్యాలు ఇచ్చే ఫారం-16, ఏఐఎస్/టీఐఎస్, బ్యాంకు ఖాతా వివరాలు, మీరు పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చిన మూలధన రాబడులు, డివిడెండ్ల ధ్రువీకరణలు, వచ్చిన అద్దెలు ఇలా ఆదాయానికి సంబంధించి అన్ని పత్రాలూ ఒక చోటకు తీసుకురండి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూలం వద్ద పన్ను (టీడీఎస్) ఎక్కడెక్కడ వర్తించిందో చూసుకోండి. దానికి సంబంధించిన వివరాలు తీసి పెట్టుకోండి. మీ వేతనం, ఫారం-16లో తెలియజేసిన మొత్తం సమానంగా ఉందా? అన్ని మినహాయింపులూ నమోదు చేశారా? ఏదైనా వ్యత్యాసం ఉందా చూసుకోండి. తేడా ఉంటే.. మీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి.
ఫారం 16తోపాటు వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్), పన్ను సమాచార నివేదిక (టీఐఎస్)నూ పరిశీలించండి. దీంతోపాటు 26ఏఎస్‌నూ చూడండి. ఇందులో మీకు వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్ను వివరాలన్నీ ఉంటాయి. వీటన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకొని, పెట్టుకోండి.
మీకు వచ్చిన ప్రతి ఆదాయాన్నీ గుర్తించండి. సరైన పన్ను రిటర్నుల ఫారాన్ని ఎంచుకునేందుకు ఇది ఎంతో కీలకం. కేవలం వేతనం ద్వారానే ఆదాయం వచ్చినప్పుడు ఐటీఆర్-1 ఎంచుకుంటే సరిపోతుంది. మూలధన రాబడులు ఇతరత్రా ఉన్నప్పుడు ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3ని ఎంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి, ఆదాయాలను గణించడంలో పొరపాటు చేయొద్దు.
ఐటీఆర్ సమర్పించే ముందు ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకొని, ఎంత మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది, రిఫండ్ ఎంత రావచ్చు అనే అంశాలపై ప్రాథమిక అంచనా వేసుకోండి. ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే.. రిటర్నులతో పాటే ఆ పని పూర్తి చేయాలి. లేకపోతే రిటర్నులు చెల్లకుండా పోయే అవకాశం ఉంది.
పన్ను ఆదా కోసం మీరు పెట్టిన పెట్టుబడులు, ఇతర ఖర్చులను జాగ్రత్తగా నమోదు చేయండి. సెక్షన్ 80సీ, 80డీ, 80జీ లాంటి వాటిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి.
2023-24 మదింపు సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’ ఆప్షన్‌గా ఉంటుంది. కాబట్టి, రిటర్నులు దాఖలు చేసేటప్పుడు పాత, కొత్త విధానాల్లో ఏది మీకు ప్రయోజనకరమో చూసుకొని, దాని ఆధారంగా రిటర్నులు సమర్పించాలి.