* హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి...

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు... ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

* మోదీ ర‌హ‌స్య అజెండా అది...

* హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి...

* తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం...

* సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌

* మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌): ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ అనే విధాన‌మ‌ని... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ర‌హ‌స్య అజెండా అదే అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మ‌రో అంశ‌మ‌ని.. కుటుంబ నియంత్ర‌ణ విధానంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోల్చితే ద‌క్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఆదివారం ఏర్పాటు చేసిన *మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌* స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాజ్యాంగం ప్ర‌సాదించిన గ్యారంటీల‌ను, మ‌న హక్కుల‌ను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు చేతులు క‌ల‌పాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్ర‌మే కాద‌ని...అది నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌ప్న‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ను భార‌త దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే అత్యుత్తుమంగా నిల‌పాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్‌.. విజ‌న్ -2050, ద‌క్షిణాది రాష్ట్రాలు ఎందుకు క‌లిసి ప‌ని చేయాల‌నే దానిపై ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే....

* కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 60 ఏళ్ల క‌లను నెర‌వేర్చినందున తెలంగాణ ప్ర‌జ‌లు సోనియా గాంధీని ఎంత‌గానో ప్రేమిస్తున్నారు..

* త‌న ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదు. ఆ పార్టీ నాయ‌కులు ఎన్నో వాగ్దానాలు చేశారే త‌ప్ప వాటిని నెర‌వేర్చ‌లేదు..

* తెలంగాణ జీడీపీ సుమారు 200 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉంది.. 2035 నాటికి దానిని ఒక మిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా మార్చాల‌నుకుంటున్నాం.

* తెలంగాణ‌ను హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ అనే మూడు జోన్లుగా విభ‌జించాం..

* 160 కిలోమీట‌ర్ల పొడ‌వైన అవుట‌ర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్‌) ప‌రిధిలోని కోర్ అర్బ‌న్ ఏరియాలో 1.2 కోట్ల ప్ర‌జ‌లు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్‌ వేర్‌, ఫార్మా రంగాల‌కు కేంద్రంగా ఉంది. చార్మినార్‌, హైద‌రాబాద్ బిర్యానీ, ముత్యాల‌కు హైద‌రాబాద్ ప్ర‌సిద్ధి...

* ఓఆర్ఆర్ ప‌రిధిలోని ఈ కోర్ అర్బ‌న్ ఏరియాను స‌ర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయ‌నున్నాం...

* ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మేం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాం. దేశంలోని ముంబ‌యి, ఢిల్లీ, బెంగ‌ళూర్‌, చెన్నై వంటి న‌గ‌రాల‌తో కాకుండా ప్ర‌పంచంలోని ముఖ్య న‌గ‌రాలైన న్యూయార్క్‌, లండ‌న్‌, సింగ‌పూర్‌, టోక్యో, సియోల్ వంటి న‌గ‌రాల‌తో పోటీప‌డేలా హైద‌రాబాద్ ఉండాల‌నుకుంటున్నాం.

* 30 వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీ నిర్మిస్తున్నాం.. ఇది భార‌త‌దేశంలోని పూర్తి హ‌రిత‌, ప‌రిశుభ్ర‌మైన‌, అత్యుత్త‌మ‌మైన న‌గ‌రంగా ఉండ‌నుంది. ప్ర‌పంచంలోని మ‌రే న‌గ‌రంతో పోల్చుకున్నా ఇది స‌రైన ప్ర‌ణాళిక‌, జోన్లు ఉన్న న‌గ‌రంగా ఉండ‌నుంది. అలాగే ఇది మొట్ట‌మొద‌టి నెట్ జీరో సిటీ..

* ఫ్యూచ‌ర్ సిటీలో మేం AI సిటీని నిర్మిస్తున్నాం.. యువ‌త కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్మిస్తున్నాం...

* ఈ ఏడాది దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో నేను పాల్గొన్నా. రూ.1,82,000+ కోట్ల‌కుపైగా పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌కు తీసుకురాగ‌లిగాం. గ‌తేడాది రూ.40 వేల పెట్టుబ‌డులు వ‌చ్చాయి.. బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌నా కాలంలో రూ.25 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను సాధించ‌లేక‌పోయింది.

* హైద‌రాబాద్ ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌కుగానూ మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు చేప‌ట్టాం..మూసా... ఈసా న‌దుల క‌ల‌యికే మూసీ... గ‌త యాభై ఏళ్లుగా కాలుష్యం కోర‌ల్లో చిక్కి మూసీ క‌నుమ‌రుగయ్యే స్థితికి చేరింది.. మా ప్ర‌భుత్వం మూసీకి పూర్వ వైభ‌వం తేవాల‌నుకుంటోంది. గోదావ‌రి నీటిని మూసీలో క‌ల‌ప‌డం ద్వారా త్రివేణి సంగమంగా మార్చ‌నున్నాం.. అక్క‌డే 200 ఎక‌రాల్లో గాంధీ స‌రోవ‌ర్‌ను నిర్మిస్తున్నాం...

* ద‌క్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ .. ఈ నేప‌థ్యంలో మేం డ్రై పోర్ట్ నిర్మించ‌నున్నాం. దానిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సీ పోర్ట్ (స‌ముద్ర రేవు)కు ప్ర‌త్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా క‌లుపుతాం..

* హైద‌రాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్య‌మ‌వుతుంది. అభివృద్ధి మొద‌ట నగ‌రాలతోనే మొద‌ల‌వుతుంద‌నేది నా భావ‌న‌... హైద‌రాబాద్ రైజింగ్ కావాలంటే అది వేగ‌వంత‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన‌, అవ‌కాశాలు క‌ల్పించే న‌గ‌రంగా ఉండాలి.

* మేం రీజిన‌ల్ రింగు రోడ్డును, రీజిన‌ల్ రింగు రైల్వే లైను నిర్మించ‌బోతున్నాం...ఈ రెండింటిని రేడియ‌ల్ రోడ్ల ద్వారా క‌ల‌ప‌నున్నాం...

* మేం ఇటీవ‌ల ఎన‌ర్జీ పాల‌సీని విడుదల చేశాం. ఈవీల‌పై ఉన్న అన్ని ప‌న్నుల‌ను తొల‌గించాం. ఈవీ ల అమ్మ‌కాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 3 వేల ఆర్టీసీ బ‌స్సులను ద‌శ‌ల‌వారీగా ఈవీలుగా మార్చ‌నున్నాం.

* ఓఆర్ఆర్‌-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య ఉన్న సెమీ అర్బ‌న్ ఏరియాను ఉత్ప‌త్తి (మాన్యుఫ్యాక్చ‌రింగ్) జోన్‌గా మార్చ‌బోతున్నాం. ఇది చైనా+1 అనే మా వ్యూహానికి ప్ర‌పంచానికి స‌మాధానంగా నిల‌వ‌నుంది.

* ఔష‌ధాలు, విత్త‌నాల ఉత్ప‌త్తిలో తెలంగాణ ముందువ‌రుస‌లో ఉంది. వాటికి అద‌నంగా ఎఫ్ఎంసీజీ, ర‌క్ష‌ణ‌, రాకెట్స్‌, స్పేస్‌, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, గ్రీన్ ఎన‌ర్జీ రంగాల్లో ముందు వ‌రుస‌లో నిల‌వాల‌నుకుంటున్నాం. భార‌త‌దేశానికి డాటా సెంట‌ర్ హ‌బ్ గా, పంప్ స్టోరేజీ హ‌బ్‌గా తెలంగాణ నిల‌వ‌నుంది. దేశంలోని ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌కు అనుసంధానమై, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంట‌ర్ గా ఉండాల‌ని మేం ఆకాంక్షిస్తున్నాం.

* ఆర్ఆర్ఆర్ వెలుప‌ల నుంచి రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న గ్రామాల‌ను మార్చాల‌నుకుంటున్నాం. గ్రామాల్లోనూ అత్యుత్త‌మ వ‌స‌తులు క‌ల్పిస్తాం.. రైతుల‌కు 24 గంట‌లు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇస్తున్నాం... రైతుల‌కు ఎక‌రాకు రూ.12 వేలు రైతు భ‌రోసా ఇస్తున్నాం.. భూమి లేని కుటుంబాల‌కు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు క్వింటాకు రూ.500 బోన‌స్ ఇస్తున్నాం..

* దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. 25 లక్ష‌ల రైతు కుటుంబాల‌కు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం.

* కేవ‌లం మౌలిక వ‌స‌తుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదు... రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, పిల్ల‌లు, వ‌యోధికుల అంద‌రి విష‌యంలోనూ మేం దృష్టి పెడుతున్నాం.. తెలంగాణ రైజింగ్‌లో వారూ భాగ‌మే.

రాజీవ్ ఆరోగ్య శ్రీ లో రూ.10 ల‌క్ష‌ల మేర హెల్త్ క‌వ‌రేజీ ఇస్తున్నాం.. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ‌లో ఎవ‌రైనా ఏ ఆసుప‌త్రికి వెళ్లినా మేం చూసుకుంటున్నాం.

విద్యా, నైపుణ్యాలు నా ప్ర‌థ‌మ ప్రాధాన్యాలు... అన్ని గురుకులాల్లో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల‌ను రెట్టింపు చేశాం.. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను నిర్మిస్తున్నాం.

* తెలంగాణ‌లో మ‌హిళ‌లంద‌రికీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించాం.. నా అక్కాచెల్లెళ్లు ఇప్ప‌టికే కోట్లాది బ‌స్సు ప్ర‌యాణాలు ఉచితంగా చేశారు. ఎంతో డ‌బ్బును ఆదా చేసుకున్నారు. అక్కా చెల్లెళ్ల‌కు రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తున్నాం. ఇళ్ల‌కు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.

* ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల ఇస్తున్నాం. ప్ర‌తి సంవ‌త్స‌రం నాలుగు ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించ‌నున్నాం. 20 ల‌క్ష‌ల పేద కుటుంబాలు సొంత ఇళ్ల క‌ల నెర‌వేరుతుంద‌ని నేను హామీ ఇస్తున్నా...

* సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం... ద‌ళితులు, ఓబీసీలు, గిరిజ‌నులు, మైనారిటీల‌కు సామాజిక న్యాయం చేస్తామ‌ని మా నాయ‌కుడు రాహుల్ గాంధీ అభ‌య‌మిచ్చారు.

* స‌మ‌గ్ర కుల స‌ర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌.. దానిని అసెంబ్లీలోనూ ప్ర‌వేశ‌పెట్టాం. జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక‌న మేం వ‌న‌రులు స‌మ‌కూర్చుతాం..

* వ‌ర్గీక‌ర‌ణ కోసం 30 ఏళ్లుగా మా మాదిగ సోద‌రసోద‌రీమ‌ణులు పోరాడుతున్నారు. వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని మేం 2024, ఫిబ్ర‌వ‌రి 4న నిర్ణ‌యం తీసుకున్నాం.. 2025, ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌త్యేక శాస‌న‌స‌భ స‌మావేశం ఏర్పాటు చేసి దాని అమ‌లుకు తీర్మానం చేశాం. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్స‌వంగా జ‌రుపుకోనున్నాం..

* సుప‌రిపాల‌న ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌..

* కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఆర్థిక స‌ర్వే నివేదిక ప్ర‌కారం అతి త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌

* గ్లోబ‌ల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్ర‌కారం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో వినియోగంలో మేం ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నాం...

* త‌ల‌స‌రి ఆదాయంలోనూ మేం ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నాం.

* ఇప్పుడు నేను మీ అంద‌రిని ప్ర‌శిస్తున్నాం... మా రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం మద్ద‌తు ఇవ్వ‌కూడ‌దా..?

* తెలంగాణ ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ అయితే అది భార‌త‌దేశ వృద్ధికి ప్ర‌యోజ‌నం కాదా..? కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు. ప్ర‌త్యేకించి ద‌క్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు.

Ck News Tv

Ck News Tv

Next Story