కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నాం: రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నాం: రేవంత్ రెడ్డి

కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నాం: రేవంత్ రెడ్డి
కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్న రేవంత్ రెడ్డి
ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి తారీఖున వేతనాలు ఇవ్వలేదని విమర్శ
పదేళ్లలో కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శ
మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, వారు చేసిన అప్పులకు ప్రతి నెల రూ.600 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తన పదేళ్ల కాలంలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి తారీఖున వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు.
పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమను తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఏడాదిలోనే తాము ఏమీ చేయలేదని చెప్పడమేమిటని ప్రశ్నించారు.
పదేళ్ల పాటు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన తమపై కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు.
ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని విమర్శించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదని విమర్శించారు.
కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పూర్తిచేశామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన మేరకు తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని ఆయన అన్నారు. దేశంలో ఎవరూ చేయలేని సాహసం తాము చేశామని ఆయన అన్నారు. వందేళ్లుగా జరగని కులగణనను తాము సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు.
ప్రజలు తిరస్కరించినప్పటికీ కేసీఆర్‌లో మార్పు రాలేదని విమర్శించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోమని చెప్పారని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంతో పేగు బంధం తెంచుకొని పార్టీ పేరును కూడా మార్చుకున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో తాము ఎన్నో చేశామని, వాటిని నెరవేర్చామని భావిస్తేనే తమకు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.
