నేనేమైనా టిష్యూ పేపర్‌నా?.. వాడుకొని వదిలేస్తామంటే కుదరదు..

నేనేమైనా టిష్యూ పేపర్‌నా?.. వాడుకొని వదిలేస్తామంటే కుదరదు..

'నేను టిష్యూ పేపర్‌లా కనిపిస్తున్నానా? నా మాటకు విలువ లేకపోతే ఎలా? నేనే వీరుడిని, శూరుడిని అంటే కుదరదు' అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని హెచ్చరించారు.

తాను ఇచ్చిన మార్కెట్‌ కమిటీల ప్రతిపాదనలను మార్చి ఎలా ప్రకటిస్తారని, ఎమ్మెల్యే పంథా మార్చుకోకపోతే వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతులు మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం వివాదాస్పదమైన విషయం తెల్సిందే.

కాగా ఆదివారం చిన్నారెడ్డి వనపర్తిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు.

కేవలం 4 నెలల కిందట పార్టీలోకి వచ్చిన మేఘారెడ్డి తనను విమర్శిస్తానంటే ఎలా ఊరుకుంటానని పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన డబ్బులను అక్కడి నుంచి తెచ్చి వనపర్తిలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను కొనుగోలు చేశారని వెల్లడించారు.

'46 ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా. విద్యార్థి దశ నుంచి ఏఐసీసీ దాకా ఎదిగా. అనేక దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశా. పార్టీలోకి వచ్చిన కొత్తవారిని నెత్తినపెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మళ్లీ భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. కొత్తవారినే నమ్ముకుంటే కాంగ్రెస్‌ పార్టీ నట్టేట మునుగుతుంది. పార్టీలో సీనియర్లను వాడుకుని వదిలేస్తామంటే ఎలా' అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పోలీసులు, ఇతర అధికారుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి ముందు కాపలాదారులుగా పోలీసుల తీరు కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టాలి.. వద్దంటే తీసేయడం అనే పరిస్థితి ఉన్నదని మండిపడ్డారు.

నా టికెట్‌ కొట్టేసిండు.. మేఘారెడ్డి అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడని చిన్నారెడ్డి విమర్శించారు. డబ్బులు ఎరజూపి ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో సోనియాగాంధీ తన పేరును టిక్‌ కొట్టి రేవంత్‌రెడ్డికి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

తన వద్ద డబ్బులు లేవని ప్రచారం చేసి వచ్చిన టికెట్‌ను మాయ చేశారని ఆరోపించారు. ఇంత జరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేసినట్టు తెలిపారు. దీనిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, మరోసారి అలాగే మాట్లాడితే కేసు పెడతానని హెచ్చరించారు.

Ck News Tv

Ck News Tv

Next Story