సీఎం రేసులో నేను లేను...

సీఎం రేసులో నేను లేను...
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇటీవల ఊహాగానాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు.
గురువారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలు పంచుకున్నారు. సీఎం రేసులో తాను లేనని స్పష్టం చేశారు. 'నేను ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలిచాను.
సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత నేను సీనియర్ సభ్యుడిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష లేదు' అని ఆయన స్పష్టం చేశారు.అయితే మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ పేరు పలుమార్లు సీఎం రేసులో ప్రచారంలోకి వచ్చింది.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో పీసీసీ చీఫ్‌గా కూడా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక కూడా ఆయన పేరు కీలకంగా తెరపైకి రాగా, సీఎం పదవి రేవంత్‌రెడ్డిని వరించింది.
పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్‌లో కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా నాయకత్వ మార్పు ఉంటుందని జోరుగా చర్చ జరుగుతున్నది. దీనిని పార్టీ నేతలెవరూ ఖండించడం లేదు.
గత కొంతకాలంగా 30సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన రద్దు కావడం, క్యాబినెట్ విస్తరణ జరగకపోవడం చూస్తుంటే నాయకత్వ మార్పును సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారిందని, ఈ క్రమంలోనే నాయకత్వాన్ని మార్చాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేసులో ఉత్తమ్ పేరు తెరపైకి వస్తున్నది.
కొత్తకార్డులిచ్చాకే సన్నబియ్యం
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ మరింత ఆలస్యం కావొచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇచ్చిన తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఏటీఎం కార్డు తరహాలో కొత్త స్మార్ట్ కార్డులు తయారు చేయిస్తున్నామని, ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలిచినట్టు తెలిపారు. కొత్త కార్డుల కోసం 18 లక్షల దరఖాస్తులు అందగా, ఇందులో సుమారు 10 లక్షల కార్డులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
బీపీఎల్ కుటుంబాలతో పాటు ఏపీఎల్(దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న) కుటుంబాలకు కూడా కార్డులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. బీపీఎల్ కుటుంబాలకు తెల్లకార్డు, ఏపీఎల్ కుటుంబాలకు నీలం రంగు కార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించింది.
ఆ తర్వాత ఈ గడువును సంక్రాంతికి పొడిగించింది. ఆ తర్వాత ఉగాది నుంచి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ గడువుకు కూడా సన్నబియ్యం లేనట్టేనని తేల్చేసింది. ఈసారి కొత్త గడువు కూడా ప్రకటించలేదు.
