జాబితాలో నుంచి ముస్లింలను తొలగిస్తే కేంద్రాన్ని ఒప్పిస్తా
బిసిల రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ

బిసిల రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియదని వ్యాఖ్య కులగణనతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటోందని ఘాటు విమర్శ
: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‌లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబా ద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బిజెపి మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత ఒక్క తప్పు చేయాలని అంటే… ఐఏఎస్‌లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సిఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సిందిపోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందని అన్నారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య, ఆ పార్టీ ఎంఎల్‌ఎల మధ్య చీలిక వచ్చిందన్నారు.
'పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయటనుండి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకున్నాయి. బిఆర్‌ఎస్ అసలు పోటీలోనే లేదు. ఈసారి 3 ఎంఎల్‌సి స్థానాల్లో బిజెపి గెలవడం తథ్యం అన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోం టోందని వ్యాఖ్యానించారు. 'బిసి జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది? మేమేమైనా ఎడ్డోళ్లమా? ముస్లింలను బిసిల్లో ఎట్లా కలుపుతారు? మేం మొలదారం కట్టు కుంటాం' అని అన్నారు. 'మాకు గోత్రం ఉంటది. వాళ్లతో మాకు పోలికేంది? ముస్లింలను బిసి జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు' అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు రఘునందన్ రావు, జి.నగేశ్, ఎంఎల్‌ఎలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు మాజీ ఎంఎల్‌ఎలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
