కేసీఆర్ బీజేపీ తో దోస్తీ... కాంగ్రెస్ తో కుస్తీ...!
బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కైవసం చేసుకుంటున్న బీజేపీ

కేసీఆర్ బీజేపీ తో దోస్తీ... కాంగ్రెస్ తో కుస్తీ...!
భారత రాష్ట్ర సమితి కానీ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కానీ…. బీజేపీపై విమర్శలు చేసి చాలా కాలం అయింది. పెద్దగా ఆ పార్టీని విమర్శించడం లేదు. సందర్భం ఏదైనా దొరికితే నేరుగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. పరిచయాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్ అయితే పార్టీ కార్యకర్తలతో సమావేశం అప్పుడు కానీ.. పార్టీ కార్యవర్గ సమావేశంలో కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా బీజేపీపై పడనీయలేదు.
బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కైవసం చేసుకుంటున్న బీజేపీ
బీజేపీ ఓ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు డేంజర్ గా మారింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకే వెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమయింది. అలాంటప్పుడు బీజేపీ విషయంలో సాఫ్ట్ గా ఉంటే ఇంకా సమస్యలు ఎదురవుతాయి. కానీ కేసీఆర్ మాత్రం .. బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా బీజేపీకి పరోక్ష మద్దతు ఇచ్చేందుకు అన్న అభిప్రాయం కలిగేలా.. బీఆర్ఎస్ నేతలు చేయడం ఆశ్చర్యకరంగా మారుతోంది.
వైసీపీ, టీడీపీల స్ట్రాటజీ పాటిస్తున్నారా?
కేసీఆర్ ఓడిపోయి ఉండవచ్చు కానీ ఆయన రాజకీయవ్యూహాల విషయంలో మాత్రం ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. గతంలో బీజేపీతో యుద్ధమే అని బహిరంగంగా ప్రకటించారు. తర్వాత బీజేపీతో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. కవితను అరెస్టు చేసినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీ జోలికి వెళ్లకూడదన్న పాలసీని ఆయన పాటిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను ఆదర్శంగా తీసుకున్నారేమో తెలియదు కానీ.. తన పార్టీ ఓటు. బ్యాంకును క్రమంగా మింగేస్తున్న బీజేపీని ఆయన పట్టించుకోనట్లే ఉన్నారు.
తెలంగాణ పరిస్థితి వేరు !
ఏపీ లాంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. అక్కడ బీజేపీ సొంతంగా ఎదిగే పరిస్థితి లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలు బీజేపీ జోలికెళ్లకుండా తమను ఆ పార్టీ టార్గెట్ చేయకుండా చూసుకుంటున్నాయి. కానీ తెలంగాణ లో పరిస్థితి వేరు. బీజేపీ చాలా వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ప్లేస్‌నే లాక్కోవాలని అనుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని చూసి చూడనట్లుగా ఉండటం మంచి రాజకీయ వ్యూహమేనా అన్నది కాలమే నిర్ణయించాలి.
