తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షాక్‌.. మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షాక్‌.. మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు

బీఆర్ఎస్ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోసారి ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలని నోటీసులు ఇవ్వగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఇక ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు. అలా చివరిసారి ఈనెల 4వ తేదీ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25వ తేదిలోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యాలయంతోపాటు శాసనసభ కార్యదర్మితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. అదేమిటంటే తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లుగా మీడియాలో రాశారని ఎమ్మెల్యేలు సుప్రీంకు తెలిపారు.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి నోటీసులు అందించారు. ఒక పార్టీ బీ-ఫామ్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించింది. పిటషనర్ల తరఫు న్యాయవాదులకు కూడా ఆదేశాలు ఇచ్చి స్పీకర్ కార్యాలయంలో నోటీసులను అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల్లో భాగంగా పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాటి కౌశిక్రెడ్డి తరఫున న్యాయవాదులు శనివారం అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి ఈ నోటీసుల్ని అందజేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్, కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపు చర్యలకు పాల్పడినందున వీరిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్ర హైకోర్టు ఇటీవల నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని స్పీకర్ కార్యాలయం అమలు చేయడంలేదని, అందువల్ల ఆదేశించాలని వివేకానందగౌడ్, కౌశిక్రెడ్డి తదితరులు విడివిడి పిటిషన్లలో సుప్రీంకోర్టును కోరారు.

వీటన్నింటినీ కలిపి గత వారం విచారించిన ధర్మాసనం… తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా స్పీకర్ కార్యాలయం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దానికి కొనసాగింపుగానే పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా వెళ్లి నోటీసుల్ని అందజేయడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Ck News Tv

Ck News Tv

Next Story