చీమలపాడు ఘటనలో ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి

తోబుట్టువుగా ఉంటా అధైర్యపడకండి…!
– చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు పొంగులేటి భరోసా
– ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం
– తాతా మధు, నామ నాగేశ్వరరావు, రాములు నాయకులను ముద్దాయిలుగా చేర్చాలి
– చనిపోయిన కుటుంబాలకు రూ. 50లక్షలు, క్షతగాత్రులకు రూ.25లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్
సి కె న్యూస్ ప్రతినిధి
కారేపల్లి : తండ్రిని కోల్పొయిన బాధలో పిల్లలు… కొడుకు దూరమైయ్యాడనే ఆవేదనలో తల్లి… భర్త కానరాని లోకాలకు వెళ్లాడనే మనోవేదనలో భార్య ఇలా గత మూడు రోజులుగా చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. వీరు పడుతున్న బాధలు తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. తోబుట్టువుగా అండగా ఉంటాను… అధైర్యపడకండని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులకు, పెళ్లిలకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా పిలిస్తే పలుకుతానని నేరుగా తనకే ఫోన్ చేయమని బాధిత కుటుంబాలకు మాట ఇచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 50వేలు చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు.
– ఆ ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చాలి
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ లే ఈ ప్రమాద ఘటనకు ప్రధాన బాధ్యులుగా పరిగణిస్తూ ఆ ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చడంతో పాటు వెంటనే ఎఫ్ఎస్ఐఆర్ ని నమోదు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ. 50లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.25లక్షల చొప్పున పార్టీ నుంచి కానీ ముద్దాయిల నుంచి కానీ వసూలు చేసి ఇవ్వాలన్నారు. ప్రమాద ఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే హాస్యస్పాదంగా ఉందన్నారు.
చనిపోయిన కుటుంబాలతో పాటు, క్షతగాత్రులకు వారి కుటుంబ సభ్యునిగా, తోబుట్టువుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోమారు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన వారిలో పొంగులేటితో పాటు మద్దినేని భేటి స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, విజయాబాయి తదితరులు ఉన్నారు.