36 మందికి ఐదుగురే వస్తారా.. ఎమ్మెల్యే సామెల్ ఆగ్రహం

36 మందికి ఐదుగురే వస్తారా.. ఎమ్మెల్యే సామెల్ ఆగ్రహం

609 మంది విద్యార్థులకు 36 మంది టీచర్లు ఉంటే కేవలం ఐదుగురే వస్తారా...? అలాగే ఐదుగురు వంట సిబ్బంది ఉంటే ముగ్గురే వస్తారా..? ఏంది..?

అంతా మీ ఇష్టమేనా..? ఇది పాఠశాల..? లేక బందెల దొడ్డా...?సమయం అనేది లేదా...? అంతా మీ ఇష్టమేనా...?...! ప్రిన్సిపాల్ అరుణ శ్రీ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ రారు..! పాఠశాలలో కుక్కలు బొర్లుతున్నాయి...! అధ్వానంగా తయారైన మెయింటెనెన్స్...! శుభ్రత లేదు...! కేవలం పసుపు కలిపిన అన్నం కిచిడి...! ఇది మనుషులు తినేదేనా...? ఈ పాఠశాలపై గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా ప్రత్యేకించి తాను దృష్టి పెట్టా..అంతేకాదు ప్రత్యేకంగా ఒక మనిషిని నియమించి వివరాలు సేకరించా...అందుకే ఉదయం 4 గంటలకే తయారై హైదరాబాదు నుండి 170 కి.మీ ప్రయాణించి ఇక్కడికి వస్తే అసలు బండారు బయటపడింది...అంటూ శాసనసభ్యులు మందుల సామెల్ అగ్రహోదగ్రులయ్యారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8.10 గంటలకు చేరుకున్న ఆయన దాదాపు రెండు గంటలకుపైగా పాఠశాలలోనే గడిపి పరిస్థితులన్నీ కూలంకషంగా తెలుసుకున్నారు. అయితే సమయం దాటిన తరువాత కూడా ఆలస్యంగా వచ్చే టీచర్లను స్వయంగా చూసిన ఎమ్మెల్యే సామెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.పైరవీల డిప్యూటేషన్లతో ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాజ్యమేలుతారా..? లక్షల జీతాలు పొందుతూ పిల్లల జీవితాలతో ఆటలాడమే కాకుండా పాఠశాలను సర్వనాశనం చేస్తారా...? అంటూ టీచర్లపై గుర్రుమన్నారు. ముఖ్యంగా ఈ నెలలో ఇంటర్,పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతుంటే అప్రమత్తమవ్వాల్సిన టీచర్లు నిర్లక్ష్యంగా రాజ్యమేలుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెనూ చార్జీలను 40 శాతం పెంచినప్పటికీ సక్రమంగా పెట్టక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తారా..? అంటూ నిలదీశారు.

నన్ను కలిసేదేంది...? పిల్లల్ని కలువు

పరిస్థితులపై ఎమ్మెల్యే సామెల్ సంబంధిత శాఖ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కు ఫోన్ చేశారు. ఒక దశలో తాను తుంగతుర్తి ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. దీంతో ఆ అధికారి మిమ్మల్ని కలుస్తాను సార్.. అంటూ బదులు ఇవ్వడంతో మరింత మండిపడ్డారు.నువ్వు నన్ను కలిసేదేంది.. పాఠశాలకు కొచ్చి పిల్లలను కలువు...అంటూ విసుక్కున్నారు.

అందరిని సస్పెండ్ చెయ్..

ఎస్టీ బాలికల వసతి గృహ పరిస్థితులన్నీ గ్రహించిన ఎమ్మెల్యే సామెల్ ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా తెలిపారు. పరిస్థితులపై సేకరించిన వీడియో క్లిప్పులను పంపించారు. నిర్లక్ష్యం చూపిన అందరిని సస్పెన్షన్ చేయడంతో పాటు.. డిప్యూటీషన్లు రద్దు చేయాలని కోరారు.లేకుంటే దీనిపై ఈనెలలో జరిగే శాసనసభ సమావేశాలలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే సామెల్ విలేకరులతో మాట్లాడారు. సంఘటనలు సీరియస్ గా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్సిఓ నిర్లక్ష్యం బాగా ఉందని, ఆయన తనిఖీలు లేవని తెలిపారు.

Ck News Tv

Ck News Tv

Next Story