HyderabadPoliticalTelangana

లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం, పావులు కదుపుతున్న నేతలు

లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం

పోటీకి సిద్ధమవుతున్న ఆయా పార్టీల నేతలు

టికెట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో తీవ్ర పోటీ

చేవెళ్ల, మల్కాజిగిరిల నుంచి రంగంలోకి మహామహులు

మల్కాజిగిరి నుంచి ప్రధాని మోదీ పోటీ?

పావులు కదుపుతున్న నేతలు

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పాలక కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను గెలవాలని పట్టుదలగా ఉంది. అలాగే బీఆర్‌ఎస్‌ చేవెళ్ల, మాల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కనబర్చిన ఊపును కొనసాగించి రెండు చోట్లా గెలుస్తామనే ధీమాతో ఉంది.

కాగా బీజేపీ నుంచి మాల్కాజిగిరిలో ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అలా అయితే బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు.*

డిసెంబరు 16: ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికలు ముందుగానే రానున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి ఆయా పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గల మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ కన్నేశాయి. హైదరాబాద్‌ మహానగరంలో అంతర్భాగంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అనే విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించిన విషయమూ విదితమే. ఇటీవల ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన తరువాత ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ సీటును కాపాడుకునేందుకు ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఒక్క అసెంబ్లీ స్థానంలోనైనా కాంగ్రెస్‌ గెలవలేదు. హోరాహోరీగా సాగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ ఉమ్మడి జిల్లాలో మాత్రం పట్టుసాధించలేకపోయింది. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని గల 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది.

మిగిలిన 11 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. బీజేపీకి ఒక్కసీటూ రాలేదు. అయితే నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడం విశేషం. దీంతో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల విజయం సాధించడం అధికార కాంగ్రె్‌సకు సవాల్‌గా మారింది.

ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్గిరి లోక్‌సభ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ శత విధాలా ప్రయత్నిస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అనూహ్యంగా ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్‌ మళ్లీ అదే విధంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బలపడొచ్చని భావిస్తోంది.

అలాగే గత పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన ‘చేవెళ్ల’ స్థానాన్నీ ఈ సారి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించగా మరో స్థానంలో 268 స్వల్ప ఓట్ల తేడాతో ఓడింది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్లను గెలుచుకునేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

రెండు చోట్ల త్రిముఖ పోటీ

ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో త్రిముఖపోటీ జరగనుంది. అధికార కాంగ్రె్‌సకు బీఆర్‌ఎ్‌సతో పోటీపడడమే కాక బీజేపీతో కూడా యుద్దం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. మల్కాజిగిరిలో అయితే తిరుగులేని ఆధిక్యత చాటింది.

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 40.85శాతం, కాంగ్రె్‌సకు 35.2శాతం, బీజేపీకి 19.37శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. అలాగే మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 47శాతం ఓట్లు రాగా కాంగ్రె్‌సకు 30.05శాతం మాత్రమే వచ్చాయి.

బీజేపీకి 20.56శాతం ఓట్లు లభించాయి. ఈ రెండు పార్లమెంట్‌ పరిధిల్లో ఓట్ల పరంగా బీజేపీ గణనీయంగా పుంజుకోవడంతో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

మల్కాజిగిరి బరిలో నరేంద్ర మోదీ?

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఇందుకోసం వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీని కూడా ఇక్కడ నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో మహబూబ్‌నగర్‌ నుంచి ఆయన పోటీచేస్తారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన పోటీ చేయలేదు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడం.. మల్కాజిగిరిలో బీజేపీ ఓట్ల శాతం పరంగా బాగా పుంజుకోవడంతో ప్రధాని మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం సాగుతోంది.

దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాగ్‌జిరి నుంచి మోదీ బరిలో దిగాలని పార్టీ నేతలు కూడా బీజేపీ అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇక్కడ పోటీ చేస్తే రాష్ట్రంలోని మిగతా లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని, పార్టీ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

టికెట్‌ రేసులో ఉన్న నేతలు వీరే…

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నగర, శివార్లలో పాగా వేయలేకపోయింది.

ఇక్కడ ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి ఆకర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వైపు బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ నేతలపై కన్నేసింది.

దీంతో ఆయా పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పుడే చెప్పడం కష్టమే! కొందరు నేతలు అటూ ఇటూ పార్టీలు మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారం మేరకు రెండు పార్లమెంట్‌ స్థానాల్లో ఆయా పార్టీల నుంచి పోటీకి రేసులో ఉన్న నేతల వివరాలు ఇలా ఉన్నాయి.

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహేశ్వరం నుంచి పోటీకి విముఖత చూపించిన సమయంలో ఆయనకు పార్టీ మరో హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

మహేశ్వరంలో ఓడితే ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా పోటీకి అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు భరోసా ఇచ్చినట్లు కేఎల్లార్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ తరుపున సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి రేసులో ఉండే అవకాశం ఉంది.

ఇక బీజేపీ తరపున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన జనార్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పోటీపడుతున్నారు. ఇక మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరుపున మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అలాగే డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం.ప్రతాప్‌, హరివర్ధన్‌రెడ్డి, మరి కొందరు నేతలు కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఉన్నట్టు సమాచారం. బీజేపీ నుంచి ప్రధాని మోదీ పేరు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో ఎంత నిజమనేది పార్టీ వర్గాలు కూడా చెప్పడం లేదు.

ఇదిలా ఉంటే ఇక్కడ నుంచి పోటీకి పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావుతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, రామచంద్రరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ పేరు కూడా వినిపిస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం లేదా ఉప్పల్‌ టికెట్‌ కావాలని కోరిన ఆయనకు బీజేపీ నుంచి అవకాశం రాలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

మరో వైపు ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి కూడా ఈ సారి టికెట్‌ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వలేదని, ఈ సారి స్థానికుడినైన తనకే లోక్‌సభ ఎన్నికల్లో అవకాశమివ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు పోటీచేస్తారనేది ఇంకా తెలియడం లేదు.గతం లో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపినాఇపుడు ఆ పరిస్థితికనిపించడం లేదు. మల్కాజిగిరిలో పోటీ అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో వెనకా ముందు అవుతున్నట్లు తెలిసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!