
అగ్రికల్చర్ హబ్ గా ఖమ్మం జిల్లా
రఘునాథపాలెం ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్‌గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు. రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో ఆదివారం పర్యటించిన ఆయన.. చింతగుర్తి, అల్లిపురంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.1,962 మద్దతు ధర చెల్లిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతుబంధు పథకం ద్వారా సీజన్‌కు రూ.5 వేల చొప్పున రైతులకు ఏటా ప్రతి ఎకరానికీ రూ.10 వేల పంటల పెట్టుబడిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ఈ పథకం విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలున్న ప్రతి రైతుకూ రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. అయితే ఆ రైతులను ఆదుకునేందుకు బోనకల్లు మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు స్వార్థపూరిత నేతలు రైతులను తప్పుదోవ పెట్టిస్తున్నారని అన్నారు. అలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్‌పర్సన్ దోరేపల్లి శ్వేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఆర్‌డీవో రవీంద్రనాథ్, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, డీసీవో విజయకుమారి, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు, కార్పొరేటర్ రావూరి కరుణ సైదుబాబు, చింతగుర్తి సర్పంచ్ మెంటెం రామారావు, బీఆర్‌ఎస్ నాయకులు మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్‌రావు, అజ్మీరా వీరూనాయక్, తాతా వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్ యాసా రామారావు, చెరుకూరి ప్రదీప్, సంక్రాంతి నాగేశ్వరరావు, ముప్పారపు ఉపేందర్‌రావు, ముప్పారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.