
ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా? కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్
రేజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు.
మేము నేరస్తులం కాదు..
ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు.
ఆప్ నేత అరెస్టు!
ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు.