ఈ అ’ధనం’ ఎవరి లబ్ది కోసం…?

*ఈ అ’ధనం’ ఎవరి లబ్ది కోసం…?*
— ఇలాగైతే ప్రమాదాలు జరగవా..?
— ఇసుక ర్యాంపులో పరిమితికి మించి ఇసుక ఎగుమతులు.
— ఈ రాంపుల్లో చట్టంలో రూపొందించిన నిబంధనలు వర్తించవా…?
అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక రాంపులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక ర్యాంపు నిర్వాహకుల ఇష్టారాజ్యమయింది. దీంతో ర్యాంపు నిర్వాహకులతో పాటు ఇసుక లారీ యజమానులకు కాసులు వర్షం కురిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వేమగిరి, బుర్రిలంకలో గల ఇసుక ర్యాంపుల నుండి వస్తున్న లారీలు పరిమితికి మించి అదికలోడు వేయటం వల్ల రహదారిపై ప్రయాణించే సమయంలో లారీలోని ఇసుక రోడ్డుపై పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు.
దీంట్లో భాగంగా ఆలమూరు మండల పరిధి కోటిపల్లి – ధవళేశ్వరం ఏటిగట్టు సమీపంలో జొన్నాడ కాలువ వంతెన వద్ద గల జంక్షన్లో జాతీయ రహదారిపై జొన్నాడ ర్యాంపు నుండి వచ్చే అధికిలోడు లారీలు నుండి రోడ్డుపై పడే ఇసుకతో ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు పలు ప్రమాదాలకు గురై క్షతగాత్రులు అవుతున్నారు. అయితే జాతీయ రహదారి నిర్వాహకులు ప్రతిరోజు ఈ ప్రాంతంలోని ఇసుకను తొలగిస్తున్నా నిత్యం ఇసుక లారీలు వలన ఇదే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు.
పరిమితికి మించి ఇసుకలోడు చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వీటిపై అధికారులు దృష్టి పెట్టకపోతే స్థానికులే ఈ లారీలపై చర్యలు తీసుకోక తప్పదని పలువురు అంటున్నారు. జొన్నాడ ఇసుక ర్యాంపు నుండి వచ్చే లారీలు చట్టంలో ఉన్న నిబంధనలు పాటించకపోయినా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకంత ఉదాసీనతని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వాల్టా చట్టాన్ని అమలు చేయలేని ప్రభుత్వ అధికారులు కనీసం వాహన చట్టానైనా అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీటికి తోడు మేము ఏమి తీసుకుపోమనట్లుగా మట్టి లారీలు కూడా తోడై అధిక లోడు, విపరీతమైన వేగంతో ఆలమూరు మండలానికి రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో రావడంతో వాహనదారులతో పాటు సమీప గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు జై కొడతారా లేక చర్యలు చేపడతారా వేసి చూద్దాం.