
కిడ్నాప్ కేసులో పదిమంది పై కేసు నమోదు
పాల్వంచకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులపై పోలీసుల మంగళవారం కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని, గట్టాయిగూడేనికి చెందిన బానోత్ స్రవంతి నటరాజ్ సెంటర్లోని సత్య ఫార్మసీలో పనిచేస్తోంది.
సోమవారం విధుల్లో ఉండగా స్రవంతికి పరిచయం ఉన్న రామకృష్ణ భార్య శైలజ కుటుంబ సభ్యులు భద్రు, రవి, శాంత, అనిల్ వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా వద్ద గల మామిడితోటలోకి తీసుకెళ్లి కర్రలతో తీవ్రంగా కొట్టారు. కాగా, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన స్రవంతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పదిమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.