
భద్రాద్రిలో దారుణం
కుక్కకాటుకు యువతి మృతి
కుక్కే కదా అనుకుంది.. చివరికి ప్రాణమే పోయింది!
కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం చోటుచేకుంది. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలురాయితండా వాసి కొట్టెం శిరీష (17)ను పెంపుడు కుక్క కరిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండాకు చెందిన కొట్టెం ముత్తయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శిరీష(17) రెండేళ్ల క్రితం కొంతకాలం ఇంటర్ పూర్తి చేసింది. హైదరాబాద్లో నర్సింగ్ కోర్సు చేసి ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంటోంది. రెండు నెలల క్రితం వారి పెంపుడు కుక్క పిల్లను గ్రామంలోని పిచ్చికుక్క కరిచింది.
శిరీష వారి పెంపుడు కుక్క పిల్లతో ఆడుకుంటున్న సమయంలో అది కాస్త శిరీషను కరిచింది. చిన్న కుక్కే కాదా అనే ధీమాతో శిరీష, వారి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు.
కొన్ని రోజుల తర్వాత పెంపుడు కుక్కపిల్ల వింతగా (తిక్కతిక్క) చేస్తుండటంతో స్థానికుల సూచనల మేరకు దానిని చంపివేశారు.దీంతో తల్లిదండ్రులు శిరీషకు వ్యాక్సిన్ వేయించేందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో తనకు భయమని చెప్పి వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించింది. నాటు మందు కూడా తీసుకోలేదని స్థానికులు తెలుపుతున్నారు.
కాగా నాలుగు రోజుల క్రితం శిరీషలో రేబిస్ లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఖమ్మం తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నాలుగైదు ఆసుపత్రులకు తీసుకువెళ్లినప్పటికీ పరిస్థితి చేయిదాటిందని వైద్యులు సూచించారు.తిరిగి ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి శిరీష మృతి చెందింది. బుధవారం దహన సంస్కారాలు నిర్వహించారు. శిరీష మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.