
భాగ్యలక్ష్మి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..
మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు లభించాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలి” అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్ సవాల్‌కు ఈటల తన నివాసం నుంచే సమాధానం ఇచ్చారు. తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని.. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం అలా మాట్లాడానని అన్నారు. ఎదుటి వారిని కించపరిచే వ్యక్తి కాదన్నారు. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత ఈ విషయంపై మాట్లాడతానన్నారు. రేపు మాట్లాడతానన్న ఈటల రాజేందర్.. అందరికీ సమాధానం చెప్తానని అన్నారు
రాజకీయ నాయకుడు కాన్ఫిడెంట్‌గా ఉండాలని.. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం అని ఆయన అన్నారు. అమ్మతోడు.. అయ్యతోడు ఇదేమి కల్చర్ అంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తాను ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడానని.. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడరన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా మాట్లాడలేదని చెప్పారు.