AdilabadTelangana

జీవితంలో ఎవరిని తక్కువగా అంచనావేయకు..

*”జీవితంలో ఎవరిని తక్కువగా అంచనావేయకు..

ఆమె ఒక అనాధ ఐతే..127 సంస్థానములుకు రాణి అయ్యింది.”*

సికే న్యూస్ ప్రతినిధి

ఆదిమ హెబ్రీ బాషలో ఎస్తేరు గ్రంథం “మెగిల్లాహ్” అని ప్రాముఖ్యముగా యూదుల పూరీము పండుగ వేడుకల్లో పర్ణశాలలో బిగ్గరగా చదువబడిన గ్రంథం. ప్రపంచ చరిత్రను, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన హస్తాల్లో ఉంచుకొన్న దేవుడు, కొంత మంది వ్యక్తులను మరుగున ఉంచి, తన స్వంత సమయములో తన మహిమార్ధం పనిచేసేలా వారి హస్తాలను కదిలించాడు. అలాంటి వారిలో ఎస్తేరు ఒకటి. పరిశుధ్ధ గ్రంథంలో నేహేమ్యా తరువాత ఎస్తేరు గ్రంథం వచ్చినప్పటికిని నేహెమ్యా కార్యక్రమములకు 30సం..లకు ముందే ఎస్తేరు కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములో జరిగినవి.

ఎస్తేరు గ్రంధం 1-6 అధ్యాయాలు లో మనం ధ్యానిస్తే పర్షియా మహా సామ్రాజ్యానికి దర్యావేషు కుమారుడైన అహశ్వేరోషు చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని సామ్రాజ్యం హిందూ దేశము నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములు. పారసీక, మాదీయ దేశాల పరాక్రమశాలులను, సంస్థానాధిపతులనందరినీ ఆహ్వానించి దాదాపు ఆరు మాసములు తన రాజ్య ప్రభావైశ్వర్యాలను, మహాత్యాతిశయ ఘనతలను ప్రదర్శిస్తూ వచ్చాడు. ఏడురోజుల విందు తరువాత తన భార్య అయిన వష్తీ రాణి అందాన్ని చూపించాలనుకున్నాడు. కాని “అవిధేయురాలైన వష్తీ రాణి యొక్క మొండితనము వల్ల రాజు కోపగించుకొని తనను రాణి పదవి నుండి తొలగించాడు.” అంతేగాక ప్రతీ యింటిలోను స్త్రీలు పురుషులకు లోబడాలని దేశమంతటా చాటించాడు. తరువాత యుద్ధములలో ఓడిపోయి నాలుగు సంవత్సరములు గడిచినపిమ్మట ఒకనాడు అనేక మంది కన్యకలలో ఒకతిగా ప్రత్యేకించబడి ఎన్నుకొనబడింది “యూదురాలైన “హదస్సా”. హదస్సా అనగా గొంజి చెట్టు. గొంజి చెట్టు అన్ని వృక్ష జాతులలో చిన్నది. గొంజి చెట్టు లాంటి సామాన్య అనాధ బాలికయైన హదస్సను దేవుడు ఎస్తేరు అనగా నక్షత్రంగా మార్చి దుఃఖాంధకారంలో మునిగిపోయిన ప్రజలమధ్య ప్రకాశింపజేసాడు.”

రాజు దగ్గర ఎంచబడిన స్త్రీలంతా ఉపపత్నులుగా ఎంచబడ్డారు కాని ఎస్తేరు జీవితం పట్ల దేవునికి గల ఉన్నతమైన ఉద్దేశం ప్రకారం అహశ్వేరోషు ఆమె పట్ల ప్రేమను, దయను కలిగించాడు. ఈ విధంగా దేవుని నిర్ణయం చొప్పున ఆమె రాణిగా చేయబడింది. ఆమె గుణ లక్షణాలు అందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. Simplycity is the mother of Beauty. ఆమె అనాధగా పెరుగుతూ ప్రార్థన శక్తి కలిగి ఉంది. అందుకే “దేవుడు ఆమె వినయ విధేయతలు చూసి ఆశీర్వదించి 127 సంస్థానములుకు రాణి గా చేశాడు.”

“ఎస్తేరు చిన్న నాటినుండి సంరక్షకునిగా ఉన్న మొర్దెకైకి సంపూర్ణ విధేయత చూపించింది.” తను అలంకరణ విషయంలో కూడా వాక్యానుసారం నడుచుకునేది. దేవుని సహాయం కొరకు చూస్తూ మొర్దెకై సలహా ప్రకారం పని జరిగించేందుకు తన ప్రాణాన్ని సహితం లెక్కచేయలేదు. తరువాత అహశ్వేరోషు రెండవ సంస్థానములో ఉన్న ప్రధాన మంత్రి, అమలేకీయుల హగగు వంశాస్తుడైన హామాను యూదులను నాశనము చేయవలెనని తాకీదులు వ్రాయించు కొనవలెనని పనిన పన్నాగమును దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షిస్తాడు. అధికార దుర్వినియోగమునకు పాల్పడిన హామాను ఆతని కుటుంబమంతా ఉరితీయించబడ్డారు. తరువాత మొర్దెకై ఆ దేశములో రెండవ మానవుడిగా హెచ్చింపబడ్డాడు. ఆయన యూదుల యొక్క సంరక్షకునిగా మార్చబడడం ఈ గ్రంథం ముగింపులో గమనించగలం.

మన జీవితాల్లో కొన్ని పర్యాయములు ఎన్నిక లేనివిగా, అల్పమైనవిగా కనిపించవచ్చు. మన జీవితంపట్ల దేవుని ప్రణాళిక ఎట్టిదో, మన ద్వారా ఆయన ఏ సంకల్పమైతే నేరవేర్చుకొనబోతున్నాడో మనకు అర్ధం కాదు. కాని దేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతీ పరిస్థితిని సంతోషంగా స్వీకరిస్తే, హదస్సాను ఎస్తేరుగా మార్చిన దేవుడు ఎందుకూ పనికిరాము అని అనుకుంటున్నా మనలను దేవుడు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కనుక అన్ని విషయాల్లో దేవుని పట్ల విధేయత చూపించే వారముగా నడచుటకు ప్రయత్నిద్దాం. ఎస్తేరు వలే తగ్గింపు కలిగి , ప్రార్థనా శక్తి కలిగి వుందాం…

-బిషప్. రెవ. డాక్టర్. పీటర్ నాయక్ లకావత్,
(హోప్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected