
BREAKING: మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
TS: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో పురుగుల మందు తాగిన ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సోని మృతి చెందారు. కాగా మొన్నటివరకు జేపీఎస్లు చేపట్టిన సమ్మెలో పాల్గొన్న ఆమె.. సమ్మె విరమించి నిన్ననే విధుల్లో చేరారు.
వరంగల్ జిల్లా: మే 12
వరంగల్ జిల్లాలో ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శి సోని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. సమ్మె విరమించి నిన్న విధుల్లో చేరిన సోని.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాక పురుగుల మందు తాగారు.
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోని నేడు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
15 రోజులుగా ఆగని సమ్మె..: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌లు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జేపీఎస్‌లు తమ నిరసనలను ఆపేసి విధుల్లో చేరాలని ఇటీవల ప్రభుత్వం హెచ్చరించింది. 9వ తేదీ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జేపీఎస్‌లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ హెచ్చరికను ఖాతరు చేయని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదే లే అంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.