
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. క్రమబద్దీకరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం చెప్పారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉండాలని స్పష్టం చేశారు.
దీనికి రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుందని తెలిపారు.
ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు.
ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. తమన క్రమబద్ధికరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత కొద్దిలుగా సమ్మె చేస్తున్నారు.
మొదటగా ప్రభుత్వం వీరికి హెచ్చరిక జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. అయితే కొంత మంది మాత్రమే విధుల్లో చేరారు. తర్వాత కొద్ది రోజులు సమ్మె చేసి మిగతా వారు కూడా విధుల్లో చేరారు.
ఈ నేపథ్యంలోవారిని క్రమబద్ధికరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు తమన క్రమబద్ధికరించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు.