Andhra PradeshNationalPoliticsTelangana

ఢిల్లీ లిక్కర్ స్కాంపై మొదటిసారి కేసీఆర్ స్పందన.. తర్వాతి అరెస్ట్ హైదరాబాద్‌లోనేనా..?

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొట్ట మొదటిసారిగా సీఎం కేసీఆర్ స్పందించారు. కేసు తెర మీదికొచ్చి సంవత్సరం గడిచినా.. ఏ ఒక్క రోజు కూడా దాని గురించి మాట్లాడని సీఎం కేసీఆర్.. ఇప్పుడు సడెన్‌గా స్పందించంటపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కేసు విచారణలో భాగంగా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు నిన్న అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ స్పందించారు. మనీశ్ సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్.

దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో దూకుడు పెంచిన సీబీఐ, ఈడీ అధికారులు.. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే.. ఇందులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. నిన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మొదటిసారిగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ఈ అరెస్టులు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అదానీకి ప్రధాని మోదీకి మధ్య ఉన్న అనుబంధం చర్చ జరగకుండా ఉండేందుకే ఈ అరెస్టులని కేసీఆర్ ఆక్షేపించారు. అయితే.. ఈ కేసు తెర మీదికి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా స్పందించని సీఎం కేసీఆర్.. ఇప్పుడు మొదటి సారి స్పందించటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే.. ఈ కేసులో మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని ముందు నుంచి సీబీఐ అధికారులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ల అనుమానానికి తగ్గట్టుగానే తెలంగాణలోని ప్రముఖ వ్యాపార వేత్తలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలుపుకుని మొత్తం 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కాగా.. తర్వాత ఎవరు అరెస్టవుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ కేసులో ముందు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు గట్టిగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి తోడు.. అరెస్టయిన వారి ఛార్జ్ షీట్లలో కవిత పేరును చేర్చటం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా.. సీబీఐ అధికారులు ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను రెండు సార్లు విచారించారు కూడా. ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించిన సమయంలోనూ.. సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం.. ఇప్పుడు ఒక్కసారిగా స్పందించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉచ్చు బిగుస్తోందంటూ బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎప్పటి నుంచే కవితపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. త్వరలోనే కవిత కూడా అరెస్టవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని నిలదీస్తూనే ఉన్నారు. తన కూతురిని కాపాడుకునేందుకే.. బీఆర్ఎస్ అంటూ కొత్త డ్రామాకు తెర తీశారంటూ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఈ క్రమంలోనే.. ఈరోజు మాజీ ఎంపీ వివేక్ కూడా తిరుమలలో కవిత అరెస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తర్వాత అరెస్టయ్యేది కవితేనంటూ చెప్పుకొచ్చారు. ఈ నేఫథ్యంలోనే సీఎం కేసీఆర్ కూడా మొదటిసారిగా ఈ కేసుపై స్పందించటం సర్వత్రా చర్చకు దారి తీసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected