తప్పు చేశావ్ ఒప్పుకో ని పవిత్రతను చాటుకో

ములుగు, రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవి పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు శ్రీరాముడు అగ్నిపరీక్ష పెట్టాడు. అలాంటి పరీక్షే నేటి ఆధునిక సమాజంలో ఓ వ్యక్తికి ఎదురైంది. ‘నీపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తవమని నమ్మాలంటే.. నువ్వు నిప్పులాంటి మగాడివని నిరూపించుకో’ అంటూ కులపెద్దలు ఆ వ్యక్తికి అగ్నిపరీక్ష పెట్టారు. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించారు. ఈ పరీక్షలో ఆ వ్యక్తి నెగ్గినా.. కుల పెద్దలు అంగీకరించలేదు. తప్పు చేశావ్ ఒప్పుకో అంటూ ఆ వ్యక్తిని వేధిస్తున్నారు. అగ్నిపరీక్ష నిర్వహణకు కొద్దిరోజుల ముందు ఆ పెద్దలు బాధితుడి నుంచి రూ.11 లక్షలు వసూలు చేయడం మరో వింత. అగ్నిపరీక్ష ఎదుర్కొన్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ములుగు మండలం బంజరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొద్ది నెలల క్రితం తమ కులానికి చెందిన పెద్ద మనుషులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ గంగాధర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయితీ పెట్టిన పెద్ద మనుషులు.. తనకు సదరు మహిళతో ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ చెప్పినా పట్టించుకోలేదు.
పైగా, పంచాయితీ నిర్వహణకని ఇరువర్గాల నుంచి రూ.11 లక్షల చొప్పున నగదు డిపాజిట్‌గా తీసుకున్నారు. మూడు నెలలుగా దశల వారీగా పంచాయితీలు నిర్వహిస్తున్నా విషయం తేలకపోవడంతో ఇటీవల ఆటవిక నిర్ణయం తీసుకున్నారు. కాలుతున్న గడ్డపారను గంగాధర్ చేతులతో పట్టుకొని తన నిజాయతీని నిరూపించుకోవాలని తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 25న ఆ తీర్పును అమలుచేశారు. కట్టెలను పేర్చి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు.
స్నానం చేసి తడిదుస్తులతో వచ్చిన గంగాధర్ ఆ కొలిమి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి అందరూ చూస్తుండగానే కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేశాడు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్నిపరీక్షలో నెగ్గాడు. కానీ, శాంతించని పెద్దమనుషులు తప్పు ఒప్పుకోవాల్సిందేనని తేల్చేశారు. దీంతో గంగాధర్ భార్య ఈ ఘటనపై అదే రోజు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము డిపాజిట్‌గా ఇచ్చిన సొమ్ములో రూ.6లక్షలను ఖర్చు చేసేశారని, తమను వేధిస్తున్నారని గంగాధర్ దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది