
న్యూఢిల్లీ :
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలకు సీఈసీ ఆదేశాలు…!
– ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లపై ఆదేశాలు
– తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం సీఈవోలకు ఆదేశాలు
– ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వహించరాదు
– ప్రస్తుత పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదు
– క్రిమినల్ కేసులు లేవని స్థానిక పోలీస్ స్టేషన్లో డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది
– అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని అధికారులు డిక్లరేషన్ తీసుకోవాలి
– బదిలీలు, పోస్టింగ్ లపై జులై 31లోగా నివేదిక ఇవ్వాలి : సీఈసీ…
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఈసీ ఆదేశాలు
శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయమై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించరాదని తెలిపింది.
అధికారులు ప్రస్తుత పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని పేర్కొంది.
Telangana Assembly Elections : ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం అదేశించింది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా… మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ గడువు జనవరి 3,6 తేదీలతో ముగియనుంది. రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పనిచేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
Election Commission: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఈసీ దృష్టి….
అందుకనుగుణంగా సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బదిలీలు, పోస్టింగుల విషయమై జూలై నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే వారిలో తమ సమీప బంధువులు ఎవరూ లేరని.. తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది.
శాసనసభ ఎన్నికల కోసం నేడు ఓటర్ల జాబితా ప్రకటన
Voter list Process in TS : మరోవైపు తెలంగాణలో త్వరలో రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే రెండో దఫా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టనుంది. ఆ తేదీకి 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఎన్నికల కమిషన్ అధికార వెబ్సైట్ www.nvsp.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
జూన్ 23 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటికి పరిశీలన చేస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూన్ 24 నుంచి జూలై 27 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సిమిలర్ ఎంట్రీల తొలగింపు తదితర ప్రక్రియను పూర్తి చేయనుంది. అనంతరం ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనుంది. దీనిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. ఏమైనా సమస్యలు, లోపాలు తలెత్తితే వాటి పరిష్కారానికి సెప్టెంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4న రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను వెలువరించనుంది